సిస్టర్ అభయ హత్య కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు తీర్పును వెలువరించింది. కేరళ, తిరువనంతపురంలోని ప్రత్యేక సిబిఐ కోర్టు సన్యాసిని హత్య కేసులో 28 ఏళ్ల  తరువాత తీర్పును ఇచ్చింది. ఒక ప్రీస్ట్, నన్ ను ఆమె హత్యలో నిందితులుగా తేల్చింది. సిస్టర్ అభయ (21) 1992లో హత్య చేయబడింది. ఆమె మృతదేహాన్ని కొట్టాయం లోని ఒక కాన్వెంట్ బావి లోపల పడేశారు.

ఈ కేసులో దోషిగా తేలిన ఫాదర్ థామస్ కొట్టూర్ మత గురువు, ఇతను కొట్టాయం బిసిఎం కాలేజీలో సిస్టర్ అభయకు మనస్తత్వశాస్త్రం బోధించేవాడు. అప్పటి బిషప్ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తరువాత కొట్టాయం లోని కాథలిక్ డియోసెస్ కులపతిగా పనిచేశాడు.

ఈ కేసులో మరో దోషి సిస్టర్ సెఫీ. ఈమె కూడా సిస్టర్ అభయ ఉన్న హాస్టల్‌లోనే ఉండేది. హాస్టల్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించేది. ఈ కేసులో శిక్ష ఏంటనేది రేపు తెలియజేస్తారు. 

హత్యకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేసిన కేసులో వీరిద్దరు దోషులుగా తేలింది. ఫాదర్ థామస్ కొట్టూర్ హౌస్ నిబంధనలు అతిక్రమించిన కేసులో కూడా దోషిగా నిర్ధారించబడ్డారు.

సిస్టర్ అభయ హత్యకేసులో న్యాయం కోసం ఏర్పడిన ప్యానెల్ లో మొదటి నుంచి ఉన్న ఏకైక సభ్యుడు, మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతేన్‌పురకల్ ఈ తీర్పు మీద సంతోషం వ్యక్త పరిచారు. ఎట్టకేలకు సిస్టర్ అభయకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. తప్పు చేసినా అధికారం, డబ్బు, కండబలంతో తప్పించుకోగలం అనుకునే వారికి ఇది గట్టి పాఠం అన్నారు. 

సిస్టర్ అభయ 1992 మార్చి 27న ఫాదర్ కొట్టూర్, మరొక ఫాదర్ జోస్ పూత్రిక్కాయిల్ సెఫీల సన్నిహిత సంబంధాలకు సాక్షిగా ఉన్నారు. ఆ రోజు తెల్లవారుజాము 4.15 గంటలకు ఆమె తన హాస్టల్ గది నుండి వంటగదికి వెడుతుండగా వారిని చూసిందని సిబిఐ తెలిపింది.

తమ సంబంధాన్ని సిస్టర్ అభయ చూడడం గమనించిన నిందితులు ఉదయం 4:15 మరియు 5 గంటల మధ్య ఆమెను బరువైన వస్తువుతో కొట్టి చంపారు. ఆ తరువాత నేరాన్ని కప్పిపుచ్చడానికి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారు.

ఈ కేసులు నిందితుల్లో ఒకరైన పూత్రిక్కాయిల్‌ను రెండేళ్ల క్రితం ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, మిగతా ఇద్దరు కొట్టూర్, సెఫీల పిటిషన్లు తిరస్కరించబడ్డాయి.

మొదట్లో సిస్టర్ అభయ మరణాన్ని పోలీసులు,  క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే దీనిమీద నిరసనలు, కోర్టుకు పిటిషన్లు వెల్లువెత్తడంతో కేసును సిబిఐకి బదిలీ చేశారు.

ఈ కేసులో సెంట్రల్ ఏజెన్సీ మొదట్లో ఇచ్చిన మూడు నివేదికలను కోర్టు తోసి పుచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీనికోసం ఆ రాత్రి కుక్కలు మొరగకపోవడం, వంటగది తలుపు బయటి నుండి లాక్ చేయబడి ఉండడం, కాన్వెంట్ లో ఉంటున్న మిగతావాళ్లు సిస్టర్ అభయ బావిలోకి "పడిపోయే" శబ్దం వినకపోవటం వంటి కారణాలను కోర్టు చూపించింది.