మధ్యాసియా దేశాల్లో విధ్వంసం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ భారత్‌లో విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నదని ఎన్ఐఏ వెల్లడించింది. ఐఎస్ఐఎస్ భావజాలంతో సంబంధమున్న ఘటనల్లో 38 కేసులు నమోదయ్యాయని, అందులో 168 మందిని అరెస్టు చేసినట్టూ తెలిపింది. విచారణలో ఇప్పటికే 27 మంది నిందితులు దోషులుగా తేలారని సంచలన విషయాలను వెల్లడించింది. 

న్యూఢిల్లీ: భారత్‌లో ఐఎస్ఐఎస్ వేళ్లూనడానికి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఆన్‌లైన్‌లో విషప్రచారంతో యువతను ఉగ్రవాదంలోకి లాగడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) వెల్లడించింది. భారత్‌లో ఐఎస్ కార్యకలాపాలు వేగమందుకున్నాయని తెలిపింది. ఇక్కడ బలపడటానికి సీరియస్‌గా ప్రయత్నిస్తున్నదని వివరించింది. ఐఎస్‌ భావజాలంతో సంబంధమున్న ఘటనలు లేదా వ్యక్తులపై 37 కేసులను నమోదు చేసినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. ఇందులో 168 మంది నిందితులను అరెస్టు చేసినట్టు వివరించింది.

‘ఐఎస్ భావజాలంతో ప్రేరణ పొందిన ఉగ్రదాడులు, కుట్ర లేదా నిధుల సమీకరణకు సంబంధించి ఎన్ఐఏ 37 కేసులను విచారిస్తున్నది. ఇందులో తాజా కేసు జూన్‌లో నమోదు చేసింది. ఈ కేసుల్లో 168 మందిని అరెస్టు చేసింది’ అని ఏజెన్సీ ఓ ప్రెస్‌నోట్‌లో వెల్లడించింది. ఇందులో మొత్తం 31 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేసినట్టు వెల్లడించింది. విచారణలో ఇప్పటికే 27 మంది నిందితులు దోషులుగా తేలారని తెలిపింది.

భారత్‌లో ప్రధానంగా ఐఎస్ఐఎస్ యువతను లక్ష్యం చేసుకుంటున్నదని, ఆన్‌లైన్‌లో వారికి చేరువవుతున్నదని ఎన్ఐఏ తెలిపింది. ఆన్‌లైన్‌లో విషప్రచారం చేసి యువతను ఉగ్రవాదంలోకి దించి మనదేశంలో వేళ్లూనడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అమాయక యువతను ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా చేరువై ఏమాత్రం ఆసక్తి చూపినట్టు కనిపించినా వెంటనే ఆన్‌లైన్ హ్యాండ్లర్‌లతో అనుసంధానంలోకి తెస్తున్నదని వివరించింది. వారితో ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చర్చ చేస్తున్నదని పేర్కొంది. తద్వార ఆ యువతను తమ ఆన్‌లైన్ కంటెంట్‌ను స్థానిక భాషల్లోకి అనువదించడం, కుట్రలు, దాడులకు సన్నద్ధత, ఆయుధాల సమీకరణ, ఐఈడీల తయారీ, ఉగ్రవాదం కోసం నిధుల సమీకరణ, లేదా దాడులకే వాడుకుంటున్నదని తెలిపింది.

మత ఛాందసత్వం మూలాలుగా ఏర్పడే కొన్ని తీవ్రవాద సంస్థలు ఆ మత చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రాజ్యాన్ని స్థాపించాలని ఉవ్విళ్లూరుతుంటాయి. ఇదే రీతిలో ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపిస్తామని ఐఎస్ఐఎస్ తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. కానీ, రాజ్యస్థాపనలో విఫలమైంది. కానీ, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఇందులో సఫలమయ్యారు. ఈ ఘటనను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా మెజార్టీ ఉగ్రవాద సంస్థలు వారికి అభినందనలు తెలిపాయి. తాలిబాన్ల విజయం ఉగ్రవాదులకు సరికొత్త ఉత్తేజాన్నిచ్చాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామంపైనే ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి.