ప్రముఖ సింగర్ అనురాధా పౌడ్వాల్ తన తల్లి అంటూ... ఓ మహిళ కోర్టుకి ఎక్కడం ఇప్పుడు సర్వత్రాచర్చనీయాంశమైంది. తాను నాలుగు రోజుల పసికందుగా ఉన్నప్పుడే తనను వదిలించుకున్నారని.. వేరే దంపతులకు ఇచ్చారంటూ సదరు మహిళ కోర్టులో చెప్పడం విశేషం. అ.యితే... ఇలాంటి అడ్డమైన వార్తలకు తాను స్పందించనంటూ అనురాధా పౌడ్వాల్ పేర్కొనడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన కర్మలా మోడెక్స్ అనే మహిళ.. అనురాధ తన కన్న తల్లి అని, పుట్టిన నాలుగు రోజులకే తనను వదిలించుకుందని షాకింగ్ ఆరోపణలు చేసింది. ఆమె బిడ్డగా తనకు దక్కాల్సిన జీవితం తనకు దక్కనందుకుగాను ఆమె నుంచి తనకు రూ.50కోట్లు పరిహారం ఇప్పించాలని జిల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

1974లో తాను అనురాధా-అరుణ్ పౌడ్వాల్ దంపతులకు పుట్టానని, అప్పట్లో గాయనిగా ఆమె బిజీగా ఉండటంతో తనను పెంచుకునేందుకు పొన్నచన్, ఆగ్నెస్ అనే దంపతులకు ఇచ్చిందని ఫిటిషన్ లో కర్మలా పేర్కొన్నారు.

తన పెంపుడు తల్లి పొన్నచన్ మంచంపట్టి ఇటీవల కన్నుమూసిందని.. చనిపోయే ముందు ఈ నిజాన్ని ఆమె బయటపెట్టిందని ఆమె కోర్టులో పేర్కొన్నారు. కాగా... ఈ పిటిషన్ కి స్పందించిన కోర్టు జనవరి 27న అనురాధా పౌడ్వాల్‌, ఆమె ఇద్దరు పిల్లలు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

కాగా.. కర్మలా చేస్తున్న ఆరోపణలపై అనురాధా స్పందించారు.  ‘ఇలాంటి పనికిమాలిన మాటలను నేను పట్టించుకోను. అడ్డమైనవారు వచ్చి అమ్మ అంటే నేను పట్టించుకోవాలా. నేను స్పందిస్తే నా స్టేటస్ దిగజారిపోతుంది. ఏదేమైనా నా గురించి ఆలోచించినందుకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అని తెలిపారు.

విచిత్రం ఏమిటంటే... అనురాధా తన తల్లి అని ఆరోపిస్తున్న కర్మాలా అనే మహిళ రూపురేఖలు కొద్దిగా అనురాధకు పోలి ఉన్నాయి. దీనికి ఆధారం చేసుకునే ఆమె డ్రామాలు ఆడుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే.. తాను డీఎన్ఏ టెస్టుకి రెడీగా ఉన్నట్లు ఆమె చెబుతుండటం విశేషం.