జమిలి ఎన్నికలు ఇప్పుడు లేనట్లే.. ఆ విధానంతో లాభాలు, నష్టాలూ ఉన్నాయ్: రాజ్యసభలో కేంద్రం
జమిలి ఎన్నికలు ఈ సారికి లేనట్లేనని కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఓ ప్రశ్నకు సమాధానంగా ఇందుకోసం ఇంకా చాలా కసరత్తు చేయాల్సి ఉన్నదని సమాధానం ఇచ్చింది. ఈ విధానంతో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని వివరించింది.

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలుమార్లు జమిలి ఎన్నికల గురించి మాట్లాడింది. జమిలి ఎన్నికలతో ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించుకోవచ్చని, రాజకీయ పార్టీలూ క్యాంపెయిన్ ఖర్చులను ఆదా చేసుకోవచ్చని, తరుచూ జరిగే ఎన్నికల కోసం విధించే ఎలక్షన్ కోడ్‌తో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతాయని వాదించింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మారోసారి జమిలి ఎన్నికల పై చర్చ మొదలైంది. దీనిపై స్పష్టత కోసం రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా రాజ్యసభలో కేంద్రానికి ఓ ప్రశ్న వేశారు. దానికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
పర్సన్నల్, పబ్లిక్ గ్రీవెన్స్ పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ.. లోక్ సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ గురించి పరిశీలనలు చేసిందని కేంద్రమంత్రి వివరించారు. ఎన్నికల సంఘం సహా ఇతర అనేక భాగస్వాములతో దీనిపై సంప్రదింపులు జరిపినట్టు పేర్కొన్నారు. ఆ కమిటీ తన రిపోర్ట్‌ను లా కమిషన్‌కు పంపిందని, జమిలి ఎన్నికల నిర్వహణకు రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్ గురించి కసరత్తు చేస్తున్నదని తెలిపారు.
జమిలి ఎన్నికలతో ప్రజా ధనం వృధా కాకుండా అడ్డుకోవచ్చని, అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు తరచూ చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలియజేశారు. అలాగే.. నష్టాలనూ ఏకరువు పెట్టారు.
ఇందుకోసం రాజ్యాంగంలోని కనీసం ఐదు అధికరణాలను సవరించాల్సి ఉంటుందని వివరించారు. అన్ని పార్టీల సమ్మతిని పొందడం, సమాఖ్య వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అంగీకారమూ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే.. ఒకేసారి లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి భారీ మొత్తంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు అవసరం పడుతాయని, దీని కోసం వేల కోట్లు అవసరం పడుతాయని పేర్కొన్నారు. ఈవీఎంలు పదిహేనేళ్లపాటు పని చేస్తాయి కాబట్టి, ప్రతి నాలుగో జమిలి ఎన్నికలకు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. అదే విధంగా భారీగా సిబ్బంది, సెక్యూరిటీ ఫోర్స్ కూడా అవసరం అని పేర్కొన్నారు.