హైదరాబాద్: అనుమానిత సిమీ ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని హైదరాబాదులో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. 2013లో జరిగిన బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల సంఘటనలతో అతనికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కెమికల్ అలీని హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం చత్తీస్ గఢ్ పోలీసులు అరెస్టు చేశారు సౌదీ అరేబియా నుంచి వచ్చిన అతన్ని అరెస్టు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. హైదరాబాదులోని బంధువుల ఇంటికి రావడానికి విమానాశ్రయంలో దిగినట్లు చెబుతున్నారు. 

అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీ రాయపూర్ లోని మౌధాపరాకు చెందినవాడు. గత ఆరేళ్లుగా అతను సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నాడు. సౌదీ అరేబియాలోని ఓ సూపర్ మార్కెట్లో అతను సేల్స్ మన్ గానూ డ్రైవర్ గానూ పనిచేస్తూ వచ్చాడు. ఆ విషయాన్ని సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ ఆరిఫ్ షేక్ రాయపూర్ లో మీడియా ప్రతినిధులకు చెప్పారు. 

తమకు అందిన సమాచారం మేరకు చత్తీస్ గర్ పోలీసులు, ఉగ్రవాద నిరోధ దళం సభ్యులు సంయుక్తంగా అతన్ని పట్టుకున్నారు. హైదరాబాదులో అరెస్టు చేసిన అతన్ని చత్తీస్ గఢ్ కు తీసుకుని వెళ్లారు. కెమికల్ అలీ స్లీపర్ సెల్ గా పనిచేశాడని చెబుతున్నారు. బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్లకు పాల్పడినవారికి అతను ఆశ్రయం కల్పించాడని పోలీసులు అంటున్నారు. 

అతని నుంచి పాస్ పోర్టు, రెండు డ్రైవింగ్ లైసెన్సులు, ఓ వోటింగ్ పాస్, ఓ వోటర్ ఐడెంటిటీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. అయితే, అజహరుద్దీన్ మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.హైదరాబాదుకు వస్తున్నట్లు సమాచారం అందుకుని పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్టు చేశారు.