సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 25 లక్షల ఆర్థిక సాయం, ఒకరికి ఉద్యోగం ప్రకటించింది.

Simhachalam Temple : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో చందనోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఊహించని ప్రమాదం జరిగింది. టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు విడిచారు. దైవదర్శానికి వచ్చిన భక్తులు ఇలా ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేసింది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చింది.

సింహాచలం ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇప్పిస్తామని ప్రకటించారు. ఇక ఈ ఘటనలో గాయపడిన భక్తులను మంత్రి పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని సూచించారు. 

సింహాచనం దుర్ఘటన గురించి తెలిసినవెంటనే హూటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేసారు హోంమంత్రి అనిత. తెల్లవారుజామునే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు... స్వయంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వేగంగా జరిగేలా చూసారు. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రులకు తరలించడం, మెరుగైన వైద్యం అందేలా చూడటం చేసారు. అంతేకాదు ఆందోళనలో ఉన్న బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. 

 సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాల్ని బుధవారం హోంమంత్రి పరామర్శించారు. ఉదయం నుంచి కేజీహెచ్ మార్చురీ వద్దే ఉండి మృతుల కుటుంబాలకు ధైర్యం చెబుతూ ఓదార్చారు. ఎట్టకేలకు మృతుల కుటుంబాల అంగీకారం మేరకు పోస్టుమార్టం జరిగేలా మార్గం సుగమం చేశారు. అలాగే బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.

ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇవాళే చెల్లించేవారమని... అయితే జిల్లా కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనర్ చందనోత్సవం పనుల్లో నిమగ్నయం ఉన్నారని తెలిపారు. కాబట్టి ఈ సాయం తర్వాత అందిస్తామన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాలుగా అండగా ఉంటామని బాధిత కుటుంబాలని హామీ ఇచ్చి, ధైర్యం చెప్పారు అనిత.