సిక్కిం వరదలు.. కొట్టుకుపోయిన చుంగ్తాంగ్ ఆనకట్ట.. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏమన్నారంటే ?
నాణ్యతా లోపంతో నిర్మించడం వల్లే చుంగ్తాంగ్ ఆనకట్ట వరదలకు తెగిపోయిందని సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నారు. దీనికి మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు.
సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. దక్షిణ ల్హోనాక్ సరస్సుపై హిమానీనదాల సరస్సు విస్ఫోటనం వల్ల 1200 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు అయిన చుంగ్తాంగ్ ఆనకట్ట కొట్టుకుపోయింది. అయితే దీనికి నిర్మాణంలో నాణ్యతాలోపమే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నారు.
24 ఏళ్లుగా అధికారంలో ఉన్న పవన్ కుమార్ చామ్లింగ్ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం నాసిరకం నిర్మాణాలను చేపట్టిందని సీఎం తమాంగ్ ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. ‘‘ డ్యామ్ దెబ్బతింది.. అందుకే వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ కారణంగానే రాష్ట్రంలోని లోయర్ బెల్ట్ లో విపత్తు సంభవించింది’’ అని ఆయన అన్నారు.
ఆనకట్ట నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదని సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నారు. అందుకే అది కొట్టుకుపోయిందని చెప్పారు. సిక్కిం ఉత్తర భాగానికి కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయిందని తెలిపారు. కాగా..ల్హోనక్ సరస్సులో మేఘస్ఫోటనం కారణంగా తీస్తా నదిలో ఆకస్మిక వరదలు భారీ మొత్తంలో నీరు పేరుకుపోవడానికి కారణమైంది. ఇది చుంగ్తాంగ్ ఆనకట్ట వైపు తిరిగింది. అది కొట్టుకుపోవడంతో పలు పట్టణాలు, గ్రామాలను వరద నీరు ముంచెత్తింది.
ఇదిలావుండగా.. ఈ వరదల వల్ల రాష్ట్రంలో 13 వంతెనలు ధ్వంసమయ్యాయి. ఇందులో ఒక్క మంగన్ జిల్లాలోనే ఎనిమిది వంతెనలు కొట్టుకుపోయాయి. గ్యాంగ్ టక్ లో మూడు వంతెనలు, నామ్చిలో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి. కాగా.. సిక్కిం వరదల్లో మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 21కి చేరింది.
బుర్దాంగ్ ప్రాంతం నుంచి గల్లంతైన 23 మంది సైనికుల్లో ఏడుగురి మృతదేహాలను దిగువన వివిధ ప్రాంతాల నుంచి వెలికితీశామని, ఒకరిని రక్షించామని, గల్లంతైన 15 మంది జవాన్ల కోసం గాలిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటివరకు 2,411 మందిని ఖాళీ చేయించి సహాయక శిబిరాల్లో ఉంచామని, ఈ విపత్తు 22,000 మందికి పైగా ప్రభావితమైందని సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్ఎస్డీఎంఏ) తన తాజా బులెటిన్లో తెలిపింది.