సిక్కింలో సంచలనం.. ప్రతిపక్షానికి దారుణమైన ఎదురుదెబ్బ
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఆ రాష్ట్ర ఓటర్లు తీర్పునిచ్చారు. సిక్కింలోని అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చాకు రెండోసారి ప్రజలు పట్టం కట్టారు. ప్రతిపక్ష పార్టీ సింగిల్ స్థానానికే పరిమితం కాగా... వరుసగా ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ సీఎం రెండుచోట్ల పోటీచేసి ఓటమి చవిచూశారు...
సిక్కిం రాష్ట్ర ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చినట్లు ఇవాళ వెల్లడైన ఫలితాల్లో తేటతెల్లమైంది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ నాయకత్వంలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. సిక్కిం రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ సొంతం చేసుకుంది. సంపూర్ణ ఆధిక్యం ఎస్‌కేఎం పార్టీ రెండోసారి ఆధిపత్యం నిలబెట్టుకుంది.
ప్రతిపక్షానికి ఘోర పరాభవం
కాగా, ప్రతిపక్ష సిక్కిం డొమోక్రాటిక్ ఫ్రంట్ ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. గత ఎన్నికలు (2019) వరకూ 25 ఏళ్లపాటు ఆ రాష్ట్రంలో అధికారంలో చెలాయించిన సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ (SDF)కు... ప్రజలు దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఎస్‌డీఎఫ్ అధినేత, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు రాష్ట్రాల్లోనూ ఓటమిని చవిచూశారు. సిక్కింలోని పోక్లోక్ కామ్రాంగ్, నామ్‌చేబంగ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన చామ్లింగ్.. రెండుచోట్లా పరాజయం మూటగట్టుకున్నారు. 1985 నుంచి 2019 వరకు వరుసగా 8సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ చామ్లింగ్ విజయం సాధించడం గమనార్హం. సిక్కింగ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న తొలి విడతలో జరగ్గా... ఇవాళ (ఆదివారం) ఉదయం 6 గంటలకు కౌంటింగ్ మొదలైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికల కౌంటింగ్ పూర్తిచేసిన ఈసీ ఫలితాలను వెల్లడించింది.