కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. వేలాది సంఖ్యలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి వారంతా ఆందోళనకు దిగారు. కాగా.. ఈ విషయంలో పలు మార్లు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపినా.. అవి సఫలం కాలేదు. కాగా..ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

అయితే.. వీరు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా హర్యానా లోని కర్నాల్ కు చెందిన ఓ మత ప్రభోదకుడు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.  ఢిల్లీ-సోనీపట్ సిరహద్దులోని కుండ్లీ దగ్గర తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా.. ఆయనకు పంజాబ్, హర్యానాలో అనేకమంది అనుచరులు ఉండటం గమనార్హం.

శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ)తో పాటు అనేక సిక్కు సంఘాల్లో ఆయన క్రియాశీల సభ్యుడు. ఆయన భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కల్పనా చావ్లా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తీసికెళ్లినపుడు ఆయన అనుచరులు వేల మంది గుమిగూడారు.

’రైతులు పడుతున్న బాధలను చూడలేకున్నాను. రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాడుతున్న వారి దుస్థితిని వర్ణించలేను. ప్రభుత్వం వారిని అణచేస్తోంది. ఇది నేరం.. పాపం... దారుణం. దీన్ని ఆపేవారెవరూ లేరు’ అని రామ్‌సింగ్‌-ఆత్మహత్యకు ముందు రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు. నా ఈ మరణం ప్రభుత్వ అణచివేతకు నిరసన...రైతుల కోసం ఈ సేవకుడు ఆత్మత్యాగం చేసుకుంటున్నాడు’ అని అందులో ఉంది. 21 రోజులుగా సాగుతున్న రైతు నిరసనలో ఇది తొలి ఆత్మహత్యగా చెబుతున్నారు.