ప్రముఖ సింగర్ సిద్దూ మూసే వాలా హత్య దేశాన్ని, ముఖ్యంగా సంగీత లోకాన్ని కదిలించింది. నడి రోడ్డుపై కారును అడ్డుకుని ఓ గ్యాంగ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేసింది. అప్పుడు సిద్దూ వెంటే అదే కారులో ఇద్దరు మిత్రులు కూడా ఉన్నారు. ఆ కారులోనే ఉన్న ఓ మిత్రుడు సిద్దూ హత్య గురించి భయానక వివరాలు చెప్పాడు.

న్యూఢిల్లీ: ప్రముఖ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసే వాలాను పట్టపగలే రోడ్డుపై కాల్చి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్దూ వెంటే ఆ థార్ జీపులో ప్రయాణిస్తున్న ఆయన మిత్రుడు భయానక వివరాలు వెల్లడించాడు.

ఎన్‌డీటీ కథనం ఆధారంగా.. బర్నాలా జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న తన బంధువు ఇంటికి సిద్దూ థార్ ఎస్‌యూవీ కారులో బయల్దేరాడు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే ఆయన ప్రయాణం కట్టాడు. సెక్యూరిటీని వెంట తీసుకెళదామని సిద్దూ ఫ్రెండ్ గుర్విందర్ సింగ్ చెప్పాడు. కానీ, బంధువు ఇల్లు సమీపంలోనే ఉండటం, అలాగే, థార్ జీపులో ఐదుగురు కూర్చోవడం సాధ్యం కాదు. కాబట్టే ఆయన సెక్యూరిటీని తీసుకెళ్లాలన్న ప్రతిపాదనను పక్కన పెట్టినట్టు గుర్విందర్ సింగ్ చెప్పాడు. సిద్దూపై దాడి జరిగినప్పుడు ఆయన వెంట థార్ జీపులో సిద్దూ ఫ్రెండ్స్ గుర్విందర్ సింగ్, గుర్ ప్రీత్ సింగ్ ఉన్నారు.

థార్ జీపులో సిద్దూ పక్కనే గుర్ ప్రీత్ సింగ్ కూర్చున్నాడు. వెనుక సీటులో గుర్విందర్ సింగ్ ఉన్నాడు. ముగ్గురితోనే జీపు దాదాపు నిండిపోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఆయన వెంట తీసుకెళ్లలేదు.

గుర్విందర్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం, సిద్దూ మూసే వాలా తన బంధువు ఇంటికి చేరగానే ఆయనపై అటాక్ జరిగింది. ఫస్ట్ షాట్ జీపు వెనుక నుంచి మొదలైంది. వెంటనే మరో వాహనం జీపు ముందుకు వచ్చి ఆగింది. ఆ జీపును బ్లాక్ చేసేసింది. అంతే.. ఆటోమేటిక్ అజాల్ట్ రైఫిల్‌తో ఓ వ్యక్తి జీపు ముందుకు వచ్చి ఎదురుగా నిలుచుని కాల్పులు ప్రారంభించాడు. సిద్దూ కూడా తన పిస్టల్ నుంచి రెండు రౌండ్లు షూట్ చేశాడు. కానీ, ఆ అజాల్ట్ రైఫిల్‌తో పోలిస్తే.. ఈ పిస్టల్ సామర్థ్యం పోల్చదగినది కాదు. 

ఆ తర్వాత మూడు వైపుల నుంచి తమ జీపు పైకి కాల్పులు జరిపారు. సిద్దూ మూసే వాలా ఆ జీపు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యం కాలేదు అని గుర్విందర్ సింగ్ చెప్పాడు. వారంతా సిద్దూను ఫోకస్ చేసుకునే కాల్పులు జరిపారని వివరించాడు.

సిద్దూ మూసే వాలాపై ఎనిమిది నుంచి పది మంది 30 రౌండ్ల కాల్పులు జరిపి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి. అన్ని సార్లు కాల్పులు జరిపిన తర్వాత కూడా వెళ్లే ముందు సిద్దూ మరణించాడా? లేదా? అని చూసి వెళ్లారని పేర్కొన్నాయి.

స్పాట్‌లో లభించిన బుల్లెట్లు ప్రకారం ఏఎన్ 94 రష్యన్ అజాాల్ట్ రైఫిల్‌ను ఉపయోగించి ఉంటారని పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. 

సిద్దూ తండ్రి ప్రకారం, సిద్దూ తన మిత్రులు గుర్విందర్ సింగ్, గురు ప్రీత్ సింగ్‌లతో థార్ కార్‌లో బయల్దేరాడు. బుల్లెట్ ప్రూఫ్ ఫార్చూనర్‌ను తీసుకెళ్లలేదు. సిద్దూ ఇద్దరు గార్డులను తండ్రి వెనుకాలో మరో వాహనంలో తీసుకెళ్లాడు. ఓ ఎస్‌యూవీ, సెడాన్ కార్ రోడ్డుపై వెయిట్ చేస్తూ ఆగాయని, ఒక్కదాంట్లో నలుగురు చొప్పున ఆయుధాలు పట్టుకుని ఉన్నారని సిద్దూ తండ్రి బల్కార్ సింగ్ వివరించారు. వారంతా సిద్దూ ప్రయాణిస్తున్న థార్ జీపుపై కాల్పులు జరిపారని, నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి పరారైపోయారని తెలిపారు. తన కొడుకు, కొడుకు మిత్రులను తాను హాస్పిటల్‌కు తరలించినట్టు వివరించారు.