బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ మేనల్లుడు సిద్ఱార్థ్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. నిందితులు సిద్ధార్థ్ శవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. కేసులో రెండో నిందితుడు వినోద్ ను వెంటపెట్టుకని వెళ్లి శవాన్ని వెలికి తీశారు. 

శ్యామ్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు తన మిత్రుడు వినోద్ తో కలిసి సిద్ధార్తను హత్య చేశాడు. ఆ తర్వాత శ్యామ్ రెడ్డి తిరుపతి వద్ద చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. వినోద్ రైలుకు ఎదురు వెళ్లి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ అతను గాయాలతో బయటపడ్డాడు. వినోద్ ను పోలీసులు పట్టుకుని విచారించడంతో పలు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

సిద్ధార్థ తండ్రి రెండో భార్య ఆస్తి కోసం తన ప్రియుడు శ్యామ్ రెడ్డి చేత హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.  శ్యామ్ రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. సిద్దార్థ తన తండ్రి మొదటి భార్య కుమారుడిగా తెలుస్తోంది. 

ఆస్తి కలిసి వస్తుందని చెప్పి శ్యామ్ రెడ్డితో సిద్ధార్థను హత్య చేయించడానికి పినతల్లి ఒప్పించనట్లు చెబుతున్నారు. వినోద్ తో కలిసి సిద్ధార్థను హత్య చేసిన శ్యామ్ తాను దొరికిపోతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే తన ఇద్దరు భార్యల మధ్య గొడవలు లేవని సిద్ధార్థ తండ్రి చెప్పారు. ఇద్దరు చాలా కలుపుగోలుగా ఉంటారని కూడా చెప్పారు.