హత్రాస్ కేసును కవర్ చేయడానికి కేరళ నుంచి యూపీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖ్ కప్పన్‌ను పోలీసులు ముందుస్తుగానే అరెస్టు చేశారు. బెయిల్ కోసం అప్లై చేసుకున్నా ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తిప్పికొట్టింది.
న్యూఢిల్లీ: దేశం మొత్తం కలకలం రేపిన యూపీలోని హత్రాస్ జిల్లాలో సామూహిక లైంగికదాడి ఘటనను కవర్ చేయడానికి దక్షిణాది రాష్ట్రం కేరళ నుంచి ఆయన యూపీకి వెళ్లాడు. కానీ, మార్గం మధ్యలోనే యూపీ పోలీసులు ఆయనను అడ్డగించారు. ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే, ఆయనకు బెయిల్ మంజూర్ చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. కానీ, జైలు అధికారులు ఇంకా ఆయనను విడిచిపెట్టలేదు. ఈడీ దాఖలు చేసిన కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నదని, అందుకే కప్పన్‌ను జైలు నుంచి విడుదల చేయడం లేదని జైళ్ల శాఖ డీజీ పౌర సంబంధాల అధికారి సంతోష్ వర్మ తెలిపారు. ఒక వైపు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. సిద్దిఖ్ కప్పన్ మాత్రం జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనపై ఈడీ దాఖలు చేసిన ఓ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నదని వివరించారు.
హత్రాస్ ఘటన 2020లో చోటుచేసుకుంది. 2020 సెప్టెంబర్ దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన నలుగురు సామూహికంగా రేప్ చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతిని హాస్పిటల్ తరలించారు. కానీ, ఆమె చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి మరణించింది. ఆ తర్వాత పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి వివాదాస్పదంగా అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించింది. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పోలీసు శాఖనే అంత్యక్రియలు చేపట్టింది.
ఈ ఘటనపై ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయడానికి వెళ్లిన సిద్దిఖ్ కప్పన్ అరెస్టు చేశారు. ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ, బెయిల్ అప్లికేషన్‌ను లక్నో ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది.
