కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య  డిమాండ్ చేశారు. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు (కేఐఏడీబీ) భూమి డీనోటిఫికేషన్‌పై దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ డిమాండ్ చేశారు. 


సిద్ధరామయ్య ఇచ్చిన ట్వీట్‌లో, కేఐఏడీబీ భూమి డీనోటిఫికేషన్‌‌పై దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అందువల్ల యడియూరప్ప తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

యడియూరప్ప భూమిని చట్టవిరుద్ధంగా డీనోటిఫై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని సిద్ధరామయ్య మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు. డిసెంబరు 22న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ప్రాథమిక సాక్ష్యాలనుబట్టి ఇది విచారించదగిన నేరంగా కనిపిస్తోందని హైకోర్టు పేర్కొన్నట్లు తెలిపారు. కేఐఏడీబీ డీనోటిఫికేషన్ కేసులో యడియూరప్ప పాత్ర గురించి లోకాయుక్త పోలీసులు 2015లో దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. 

యడియూరప్పను రెండో నిందితునిగా పేర్కొందన్నారు. ఈ నేపథ్యంలో యడియూరప్ప తన అధికారాన్ని దుర్వినియోగపరచి, దర్యాప్తును పక్కదోవ పట్టించే అవకాశం ఉందన్నారు. నిష్పాక్షికంగా దర్యాప్తు జరగడానికి వీలుగా ఆయన తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత దర్యాప్తుపై నిలుపుదల ఉత్తర్వులు తీసుకురావడం ఆయన అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ అని తెలిపారు.