కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం బలహీనంగా మారడానికి సిద్ధారామయ్యే కారణమనే ఆరోపణలు వినపడుతున్నాయి. మూడు వారాల క్రితం సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన దాదాపు 16మంది ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో.. కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాల్సి వచ్చింది.

అయితే... ఈ 16మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం వెనుక సిద్ధారామయ్య ఉన్నాడంటూ అసమ్మతి ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఆరోరపించారు. ఆయనే తమని పార్టీకి దూరంగా ఉండాలని సూచించారని  శివరామ్ హెబ్బర్ మీడియా ముందు తెలిపారు. ఆయన చెప్పినట్లే తాము చేశామని... ఇప్పుడేమో ప్రభుత్వం కూలిపోయాక తమపైనే నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉండమని సిద్ధారమయ్య ఇచ్చిన సూచనల మేరకు తాము ఇలా చేశామని ఆయన చెప్పారు. తామంతా ఒకే మాట మీద ఉన్నామన్నారు. తామెవ్వరం బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

కాగా ఈ ఆరోపణలపై సిద్ధారామయ్య స్పందించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆరోపణలో మరోసారి ఎవరైనా చేస్తే గట్టిగా బుద్ధి చెప్తానని ఆయన ట్వీట్ చేశారు.