ఒకేసారి 10 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలో కుమారస్వామి సర్కార్ సంక్షోభంలో పడింది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ పెద్దలు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయినప్పటికీ రెబల్ ఎమ్మెల్యేలు బెట్టు వీడటం లేదు. అయితే శాసనసభ్యుల రాజీనామా వెనుక సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పాత్ర వుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సంకీర్ణ ప్రభుత్వంపై తొలి నుంచి  అసంతృప్తిగా ఉన్న వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు... సిద్ధూ వర్గీయులే ఉన్నారు.  తాజాగా 12 మంది శాసనసభ్యులు సిద్ధరామయ్య సూచన మేరకే రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది.

దీనికి తోడు వారిలో కొందరు సిద్ధరామయ్యకి సీఎం పీఠం అప్పగిస్తే తాము రాజీనామా ఉపసంహరించుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో తాను ఓడిపోవడానికి జేడీఎస్సే కారణమని సిద్ధరామయ్య తొలి నుంచి ఆగ్రహంగా ఉన్నారు.

జేడీఎస్ అధినేత దేవెగౌడతో వైరంతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలోని పలువురితో విభేదాల వల్ల సిద్ధరామయ్య... కుమారస్వామి ప్రభుత్వానికి మంట పెడుతున్నారని విశ్లేషకుల అంచనా.

మరోవైపు కర్ణాటక సంక్షోభంపై దృష్టిసారించిన కాంగ్రెస్ హైకమాండ్... రాష్ట్ర ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్ సాయంతో పరిస్ధితిని సమీక్షిస్తోంది. సిద్ధరామయ్య సీఎం, జేడీఎస్ నేత రేవణ్ణ ఉప ముఖ్యమంత్రి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కొందరు ఎమ్మెల్యేలు ఆయనతో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మాజీ మంత్రి రామలింగారెడ్డి, మరో ఎమ్మెల్యే మునిరత్న రెబెల్స్ ఎమ్మెల్యేల తరపున రాయబారం నడిపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాజీనామా చేసి ముంబై వెళ్లిన ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు మొదలయ్యాయి. కానీ వారు వీటిని లైట్ తీసుకున్నట్లుగా ఉన్నారు.

సంక్షోభంపై వేణుగోపాల్ స్పందిస్తూ.. తాను చెప్పిన వారికి కేబినెట్ హోదా ఇచ్చివుంటే పరిస్ధితి ఇంతగా దిగజారేది కాదని.. దాని వల్లే వారు అలకబూనారని.. న్యాయం చేయకుంటే ఏం చేస్తారని వేణుగోపాల్ నేతలను ప్రశ్నించారు. తానేం చేయలేనని.. పరిస్ధితి చేయి దాటిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.