చండీగఢ్: ఆమె తలపై రెండు గన్ షాట్స్, ముఖంపై ఓ గన్ షాట్ తగిలాయి. అదే గాయాలతో 42 ఏళ్ల పంజాబ్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి 7 కిలోమీటర్లు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. 

ఓ భూవివాదం కేసులో తన సోదడురు, మేనల్లుడిపై ఫిర్యాదు చేయడానికి ఆమె గాయాలతో తమ వద్దకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తన టీనేజ్ అల్లుడు భూవివాదం కేసులో తనపై, తన తల్లి సుఖ్బీందర్ కౌర్ పై కాల్పులు జరిపాడని సుమీత్ కౌర్ చెప్పింది. ఇరువురు కూడా గాయపడ్డారు. 

ఆ సంఘటన పంజాబ్ లోని ముక్తసర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. టీనేజ్ యువకుడు పదో తరగతి చదువుతున్నాడు. పోలీసు స్టేషన్ కు వచ్చిన ఇద్దరు మహిళలను కూడా ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు వారి శరీరాల నుంచి బుల్లెట్లు తొలగించారు. 

తనకు, తన తల్లికి చెందిన భూమిని ఆక్రమించుకోవడానికి తన సోదరుడు హరీందర్ సింగ్ ప్రయత్నిస్తున్నాడని సుమీత్ కౌర్ పోలీసులకు చెప్పింది. 

తన తండ్రి మరణం తర్వాత తనకూ తన తల్లికీ కలిపి 16 ఎకరాల భూమి వచ్చిందని, ఆ మొత్తం భూమిని తన సోదరుడు ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని ఆమె వివరించింది. 

తన సోదరుడు, అతని కుమారుడు గతంలో కూడా తమను చంపడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. పోలీసులు సుమీత్ కౌర్ సోదరుడిపై, అతని కుమారుడిపై కేసు నమోదు చేశారు.