జీ20 సదస్సు నుంచి స్వల్ప విరామం.. అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన రిషి సునక్, భార్య అక్షతామూర్తి
జీ20 సదస్సు కోసం భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన భార్యతో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి సాధువులతో రిషి మాట్లాడారు.

జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న యూకే ప్రధాని రిషి సునక్ స్వల్ప విరామం తీసుకున్నారు. ఆయన తన భార్యతో అక్షతామూర్తితో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం ఉదయం సమయంలో తన సతీమణితో కలిసి అక్కడి చేరుకున్న సునక్.. ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దంపతులు ఆలయంలో సుమారు గంటపాటు గడిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్శన గురించి అక్షరధామ్ ఆలయ డైరెక్టర్ జ్యోతీంద్ర దవే ‘ఇండియా టుడే’ మాట్లాడుతూ.. సునక్ చెప్పులు లేకుండానే ఆలయంలోకి వచ్చారని, దేవాలయాన్ని సందర్శించేటప్పుడు హిందువులు అనుసరించే సంప్రదాయాలను అనుసరించారని అన్నారు.
ఆలయంలో దర్శనం కావాలని, ఎప్పుడు వీలవుతుందని రిషి సునత్ తమను కోరారని చెప్పారు. ఎప్పుడైనా రావచ్చని తాము బదులిచ్చామని ఆలయ డైరెక్టర్ తెలిపారు. సునక్ ఆలయంలో హారతి ఇచ్చారని, సాధువులను కలుసుకున్నారని, విగ్రహాలకు పూలు సమర్పించారని చెప్పారు. ఆయన భార్య కూడా పూజలు చేశారని చెప్పారు. ఇక్కడ ఆయన ప్రతీ నిమిషం ఆనందంగా ఉన్నారని తెలిపారు. తాము ఆలయ నమూనాను రిషికి బహుమతిగా ఇచ్చామని చెప్పారు.
కాగా.. ఆలయంలో పూజల అనంతరం సునక్ రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. బ్రిటన్ ప్రధాని అయిన తర్వాత రిషి సునక్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్ కు వచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన హిందూ మూలాలపై గర్వం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ఓ ఆలయాన్ని సందర్శించడానికి సమయం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాను, భార్య అక్షత తరచూ సందర్శించే తమకు ఇష్టమైన ఢిల్లీ రెస్టారెంట్లను సందర్శించాలని యోచిస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, జీ20ని అఖండ విజయం సాధించడంలో ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నానని సునక్ తెలిపారు. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సునక్ తో సమావేశమైన ప్రధాని మోదీ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ ఏడాది మేలో హిరోషిమాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన సమావేశంలో భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఆవిష్కరణలు, సైన్స్తో పాటు ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.