ఉక్కపోతగా ఉందని సాకెట్ లో ఉన్న వెంటిలేటర్ ప్లగ్ ని తొలగించి కూలర్ ప్లగ్ ని పెట్టడంతో 40 సంవత్సరాల రోగి ఆసుపత్రిలో మరణించాడు. ఈ విస్మయకర సంఘటన రాజస్థాన్ లోని కోట ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్ కి గురైన ఆసుపత్రి అధికారులు విచారణకు ఆదేశించారు. 

వివరాల్లోకి వెళితే.... 40 సంవత్సరాల ఒక కరోనా అనుమానితుడు కోటాలోని ఎంబిఎస్ ఆసుపత్రిలో చేరాడు. అతడు తీవ్ర అనారోగ్యంతో బాధఫపడుతుంటే..అతడిని ఐసీయూలో చేర్చారు. అతనికి తరువాత కరోనా రిపోర్టులో నెగటివ్ వచ్చింది. ఇలా ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఐసీయూలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందు జాగ్రత్తుగా ఈ పేషెంట్ ని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. 

ఎండలు మండిపోతుండడంతో... ఆ రూమ్ లో బాగా ఉక్కపోతగా ఉండడంతో రోగి కుటుంబ సభ్యులు ఇంటి నుండి కూలర్ తెచ్చుకున్నారు. కూలర్ ప్లగ్ ని పెట్టడానికి వేరే సాకెట్ ఏది లేకపోవడంతో అక్కడి సాకెట్ లో ఉన్న ఒక ప్లగ్ ని పీకేసి కూలర్ పెట్టుకున్నారు. అది కాస్తా వెంటిలేటర్ ప్లగ్. 

అరగంటపాటు బ్యాటరీ బ్యాక్ అప్ మీద నడిచినప్పటికీ... ఆ తరువాత అది ఆగిపోవడంతో ఆ మనిషి మరణించాడు. ఒక్కసారిగా ఈ సంఘటనతో డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు షాక్ కి గురయ్యారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

ఇకపోతే....తెలంగాణలో కరోనా కేసుల ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 499 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,525కి చేరింది. ఇవాళ ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 198కి చేరుకుంది.

రాష్ట్రంలో 2,976 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,352 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్నట్లుగానే హైదరాబాద్‌లో 329 కేసులు నమోదవ్వగా, రంగారెడ్డిలో 129, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండలో నాలుగేసి చొప్పున, మహబూబ్‌నగర్ 6, జనగామ 7 కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌లో తాత్కాలిక సచివాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారినపడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి.

కరోనా భయంతో మిగిలిన శాఖల్లోనూ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవలే ఆర్ధిక శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావడం లేదు.

అత్యవసరమైతే తప్పించి మిగిలిన ఉద్యోగులు కూడా సచివాలయం వైపు తొంగిచూడటం లేదు. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది.