మద్యం మత్తులోతన భర్త తరచూ ఆడపిల్ల పుట్టిందంటూ గొడవలు పెట్టుకుంటున్నాడని.. అది తట్టుకోలేక తన కుమార్తెను హత్య చేసినట్లు 22 ఏళ్ల మహిళ అంగీకరించింది.
పుదుచ్చేరి : ఓ తల్లి అమానుషానికి ఒడి గట్టింది. నవమాసాలు కడుపున మోసి.. ఎన్నో ఇబ్బందులు పడి కన్న బిడ్డను అతి దారుణంగా సజీవంగా పూడ్చి పెట్టింది. భర్త పెట్టే చిత్ర హింసలకు తాళలేక చిన్నారిని వదిలించుకోవాలనుకుంది. ఆడపిల్లను అంతలోనే అంతులేని లోకాలకు పంపించింది. ఈ ఘటన పుదుచ్చేరి సమీపంలోని మూర్తికుప్పంలో వెలుగు చూసింది. 22 ఏళ్ల మహిళ తనకు పుట్టిన ఆడబిడ్డను సజీవంగా పూడ్చిపెట్టింది. ఈ విషయం వెలుగు చూడడంతో.. చంపిన ఆరోపణలపై ఆ మహిళను కిరుమంపక్కం పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంఘటన ఏప్రిల్ 15 శనివారం జరిగింది. అయితే మూర్తికుప్పం శ్మశానవాటిక సమీపంలో ఇసుక దిబ్బను స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. ఆ దిబ్బలోనుంచి 27 రోజుల పసికందు కాలు బయటకు వచ్చింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. తల్లే సజీవంగా పాతిపెట్టినట్లు తేలింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలోని కొరట్టూరుకు చెందిన కుమారేశన్ (32), అతని భార్య నిందితురాలు సంగీత ఇటీవలే పుదుచ్చేరికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నెల రోజుల క్రితం సంగీత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కుమరేశన్ మద్యానికి బానిసై ఆడబిడ్డ పుట్టిందని భార్యతో తరచూ గొడవలు పడేవాడు. శనివారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో సంగీత ఆ చిన్నారి వల్లే తనకిన్ని కష్టాలు అంటూ ఆడబిడ్డను తీసుకెళ్లి మూర్తికుప్పంలో సజీవంగా పూడ్చిపెట్టింది. తన కూతురిని తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. ఆదివారం ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
భార్యను కాటేసిన పాము... ఆస్పత్రికి పామును తీసుకెళ్లిన భర్త
ఇదిలా ఉండగా, ఎప్రిల్ 5న ఇలాంటి ఘటనే కేరళలో వెలుగు చూసింది. కేరళలోని తిరువనంతపురంలో ఓ మహిళ ఇంట్లోనే డెలివరీ అయ్యి, అప్పుడే పుట్టిన పసికందును ఓ గుడ్డలో చుట్టింది. ఆ బిడ్డని బాత్రూం లోని బకెట్ లో పెట్టేసింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తడిచిన బట్టలతోనే ఆసుపత్రికి వెళ్ళింది. తనకు వైద్యం చేయాలని డాక్టర్లను కోరింది. ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయిన వారు ఏమైందని ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది. ఆమె చెప్పిన విషయం విని షాక్ అయిన డాక్టర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వైద్యుల అందించిన సమాచారం మేరకు ఆ మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులు బాత్రూంలోని బకెట్లో ఉన్న పసికందును కాపాడారు. ఈ ఘటన కేరళలోని అళప్పుళలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం కేరళలోని అళప్పుళలో ఓ మహిళ తన ఇంటి దగ్గరే ప్రసవించింది. ఏమైందో తెలియదు కానీ ప్రసవించిన వెంటనే శిశువును గుడ్డులో చుట్టి బాత్రూంలోని బకెట్ లో పెట్టింది. ఆ తర్వాత రక్తంతో తడిసిన ఆ బట్టలతోనే చెంగనూరు ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడి వైద్యులతో తనకు వైద్యం చేయాలని కోరింది.
దీంతో వైద్యులు ఏమైందని ప్రశ్నించగా.. తాను డెలివరీ అయ్యానని.. ఇంట్లోనే బిడ్డను వదిలేసి వచ్చానని చెప్పింది. వెంటనే వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆ మహిళ ఇంటికి చేరుకుని బకెట్లో ఉన్న శిశువును గుర్తించారు. చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆ శిశువును పరిశీలించిన వైద్యులు మగ శిశువుగా గుర్తించారు. బరువు 1.3కేజీలు ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్యం బాగానే ఉందని ధ్రువీకరించారు.
తల్లి ఈ ప్రవర్తనతో అనుమానించిన పోలీసులు పథనంథిట్ట శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించి.. శిశువును వారికి అప్పజెప్పారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు.. శిశువుకు మెరుగైన వైద్యం కోసం కొట్టాయం వైద్య కళాశాల ఆసుపత్రికి తమ వాలంటీర్ల సహాయంతో తరలించారు. కాగా, రక్తమొడుతూ ఆసుపత్రికి చేరిన తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె చికిత్స అనంతరం పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. ఇంత జరిగినా ఆమె నవజాత శిశువును అలా బకెట్లో ఎందుకు వదిలేసి వచ్చిందో అనే అంశం వెలుగులోకి రాలేదు. మృత శిశువు అయి ఉంటుందన్న కారణంతోనే బకెట్లో వదిలేసి ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు.
