ఆరుగురు బాలికలు కలిసి ఆత్మహత్యకు యత్నించారు. ఇందులో ముగ్గురు చనిపోగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బిహార్‌లో ఔరంగబాద్‌లో చోటుచేసుకుంది.
ఆరుగురు బాలికలు కలిసి ఆత్మహత్యకు యత్నించారు. ఇందులో ముగ్గురు చనిపోగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బిహార్‌లో ఔరంగబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. కాస్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు స్నేహితులు. వీరందరి వయసు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంది. బాలికలు శుక్రవారం గ్రామానికి సమీపంలోకి చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఓపొలంలో విషం సేవించారు. కొంత సమయం తర్వాత పొలంలో బాలికలు ఉండటం గుర్తించిన గ్రామస్థులు.. వారి పరిస్థితి క్షీణించడం గమనించారు. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మగద్ మెడికల్ కాలేజీలో చేర్పించారు.
అయితే విషం సేవించిన ముగ్గురు బాలికలు మరణించగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే బాలికలకు విష పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది.. వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై తాము విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక, మృతిచెందిన ముగ్గురు బాలికలను నీలం కుమారి, కాజల్ కుమారి, అనీషా కుమారిగా గుర్తించారు.
ఈ ఘటనపై ఔరంగాబాద్ ఎస్పీ కంతేష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి తన సోదరుడి బావను ప్రేమిస్తోంది. శుక్రవారం ఆ అమ్మాయి తన ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి అబ్బాయి వద్దకు వెళ్లింది. తనను పెళ్లి చేసుకోమని అతడిని అడిగింది. అయితే ఆమె ప్రతిపాదనను అబ్బాయి తిరస్కరించాడు. ఆ తర్వాత స్నేహితురాళ్లతో కలిసి ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. కానీ నిరాశ చెందిన అమ్మాయి సాయంత్రం విషపూరితమైన పదార్థాన్ని సేవించింది. ఆమెతో పాటు ఉన్న మరో ఐదుగురు అమ్మాయిలు కూడా ఆమెను అనుసరించి విష పదార్థం సేవరించారు’’ అని తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఏరియా సర్కిల్ అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు గ్రామంలో మకాం వేశారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.
