మన దేశంలో అసలు మహిళలకు రక్షణే లేకుండా పోతోంది. ఇటీవల కాలంలో యువతులు, మహిళలపై అఘాయిత్యాలు మరీ ఎక్కువయ్యాయి. ఇన్నాళ్లు ఇక్కడ మహిళలను శారీరక దోపిడీలకు పాల్పడ్డ ఘటనలే వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ మహిళ  శ్రమ దోపిడీకి గురయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

గ్రేటర్ నోయిడా పట్టణంలోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఓ సెలూన్ లో ఓ యువతి ఇటీవలే ఉద్యోగంలో చేరింది. ఆర్థిక కష్టాల కారణంగానే ఉద్యోగం చేస్తున్న ఆమెకు జీతం డబ్బులు చాలా అవసరం. అయితే సెలూన్ యజమాని మాత్రం మొదటినెల జీతం ఇవ్వకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నాడు. రోజూ ఇదే విధమైన సమాధానం రావడంతో యువతి యజమానిని ఈసారి కాస్త గట్టిగా నిలదీసింది.  దీంతో కోపోద్రిక్తులడైన సెలూన్ యజమాని మానవత్వాన్ని మరిచి దారుణంగా ప్రవర్తించాడు. 

యువతిని నడిరోడ్డుపైకి తీసుకువచ్చి తోటి సిబ్బందితో కలిసి బౌతిక  దాడికి పాల్పడ్డాడు. కర్రలతో అమానుషంగా  కొడుతూ...జుట్టు పట్టి నేలపై పడేస్తూ కొట్టారు. రోడ్డుపై వెళుతున్న వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా కర్కశత్వంగా వ్యవహరించారు. 

అయితే ఈ దాడిని ఎవరో తన సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళపట్ల ఇంత దారుణంగా పాల్పడటాన్ని సహించలేకపోయిన నెటిజన్లు పోలీసుల దృష్టికి వెళ్లేలా  షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు పోలీసులకు, నోయిడాలోని అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. 

వీడియో