Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో తల్లి, తమ్ముడు మృతి.. ఆకలిదప్పులతో 2 రోజులపాటు శవాల పక్కనే...

బెంగళూరులో షాకింగ్ ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలియక తల్లి, సోదరుడు మృతదేహాల పక్కనే మతి స్థిమితంలేని ఒక మహిళ రెండు రోజుల పాటు ఆకలితో అలమటిస్తూ గడిపిన ఘటన కలకలం రేపింది. అయితే ఆ ఇంటినుంచి దుర్వాసనం రావడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

shocking incident in bangalore - bsb
Author
Hyderabad, First Published May 13, 2021, 5:04 PM IST

బెంగళూరులో షాకింగ్ ఉదంతం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలియక తల్లి, సోదరుడు మృతదేహాల పక్కనే మతి స్థిమితంలేని ఒక మహిళ రెండు రోజుల పాటు ఆకలితో అలమటిస్తూ గడిపిన ఘటన కలకలం రేపింది. అయితే ఆ ఇంటినుంచి దుర్వాసనం రావడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో గురువారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం రాజేశ్వరి నగర్ లో నివసించే ప్రవీణ్ తన ఇంటి యజమాని ఇంట్లోంచి వాసన వస్తోందని పోలీసులకు తెలిపాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించారు. ముందు గదిలో ఒకటి, తరువాత గదిలో మరొకటి మొత్తం రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండడం గుర్తించారు. 

వీరిని అర్యాంబ(65), హరీష్ (45) లుగా గుర్తించారు. కాగా మరో మహిళ శ్రీలక్ష్మి (45) ప్రాణాలతో ఉంది. వీరు మరణించారని తెలియని ఈమె ఆకలితో అలమటిస్తూ ఇంట్లోనే గడిపిందని పోలీసులు తెలిపారు. ఈమె మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని తెలిపారు. 

దర్యాప్తు ప్రారంభించామని పోలీసు ఉన్నతాధికారి సంజీవ్ పాటిల్ వెల్లడించారు. కాగా, మరోవైపు శ్రీలక్ష్మి అమ్మ నిద్రపోతోందనుకున్నానని, లేచి అన్నం వండి పెడుతుందని చూస్తున్నానని.. రోజూ అమ్మే వంట చేస్తుందని, రెండు రోజులుగా ఏమీ తినలేదని అమాయకంగా పోలీసులకు తెలిపింది. 

రెండు రోజుల క్రితం అమ్మ కిందపడిపోతే, హరీష్ చాలాసార్లు అంబులెన్స్ కు ఫోన్ చేశాడని అయినా ఎవరూ రాలేదని తెలిపింది. ఆ తరువాత అతను కూడా పడిపోయాడని విచారణలో వెల్లడించింది. సోమవారం ఉదయం హరీష్ 108కు పలుసార్లు ఫోన్ చేసినట్టుగా అతని కాల్ రికార్డ్ ద్వారా పోలీసులు గుర్తించారు.

ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న హరీష్ తల్లి, పెళ్లి కాని అక్క శ్రీలక్ష్మితో కలిసి నివసిస్తున్నాడు. గత నెల ఏప్రిల్ 22న అతనికి కరోనా నిర్థారణ అయ్యింది. దీంతో అతను హోం ఐసోలేషన్ లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios