తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతని అనుమానం. భార్య ప్రియుడిని ఎలాగైనా చంపేయాలంటూ అతని మనసులో ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో కలకలం రేపుతుండటంతో.. దానిని అవకాశంగా తీసుకున్నాడు. కరోనాకి మందు అని చెప్పి.. భార్య ప్రియుడి కుటుంబాన్ని చంపేందుకు ప్లాన్ వేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రదీప్‌(42) అనే వ్యక్తి, ఓ హోం గార్డుతో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. దాంతో హోం గార్డును చంపాలని భావించాడు. కరోనా రూపంలో అవకాశం రావడంతో హోం గార్డును చంపేందుకు పథకం రచించాడు. 

ఇందుకు గాను ఇద్దరు మహిళల సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సదరు స్త్రీలు ఆదివారం సాయంత్రం ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లో నివాసం ఉంటున్న హోం గార్డు ఇంటికి వెళ్లారు.తాము ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలమని.. కరోనా చెకప్‌ కోసం వచ్చామని చెప్పారు. ప్రభుత్వం కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలకు మందులు ఇస్తుందని నమ్మించారు.

ఆ తర్వాత  హోం గార్డు, అతని కుటుంబ సభ్యుల చేత విషం తాగించారు. అనంతరం నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నారు. కాసేపటికే హోం గార్డుతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అనంతరం హోం గార్డు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

బాధితుడి ఇంటి వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా సదరు మహిళలను గుర్తించి అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారు ప్రదీప్‌ తమకు డబ్బులు ఇచ్చి..  హోం గార్డు కుటంబానికి విషం ఇవ్వాల్సిందిగా కోరాడని పోలీసుల విచారణలో తెలిపారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ప్రదీప్‌ కోసం గాలిస్తున్నారు.