బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) నుంచి తప్పుకుంటున్నట్లు శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అకాలీదళ్ పార్టీ చీఫ్ సుఖ్ భీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. 

వ్యవసాయ బిల్లుల గురించి చర్చించేందుకు అకాలిదళ్ పార్టీ ప్రధాన కమిటీ శనివారం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు సుఖ్‌బీర్ సింగ్ బాదల్.

రైతులను నష్టం చేకూర్చేలా వ్యవసాయ బిల్లులు వున్నాయని... కాబట్టి వారికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నుండి వైదొలగాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 

మరోవైపు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) కూటమి నుంచి ఒక్కో పార్టీ వైదొలగడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మొదటి నుంచి బీజేపీతో జట్టుకట్టిన తెలుగుదేశం పార్టీ గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందే తప్పకుంది.

ఇప్పుడు అదే బాటలో పలు పార్టీలు సైతం నడుస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా వున్న శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుడ్‌బై చెప్పింది. 

Also Read:బిజెపికి బిగ్ షాక్... శివసేన బాటలోనే అకాలీదళ్, ఎన్డీఏ నుండి బైటకు

ఫలితాల అనంతరం ఇరు పార్టీల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఎన్డీయే నుంచి శివసేన తప్పుకుంది. అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జట్టుకట్టడంతో పార్లమెంట్‌లో ఎన్డీయేకు కొంతలోటు ఏర్పడింది.

ఈ పరిణామాలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. శివసేనతో పాటు శిరోమణి అకాలీదళ్ తప్పుకోవడంతో ఎన్డీయే విచ్ఛిన్నమైందని.. తాము ఇరువురం లేని కూటమి ఎప్పటికీ ఎన్డీయే కానేకాదని రౌత్ స్పష్టం చేశారు.

కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ నుంచి తప్పుకుంటున్నాయని సంజయ్ గుర్తుచేశారు. తమ స్థానంలో వచ్చే కొత్త స్నేహితులు సైతం ఎంతకాలం ఉంటారో చెప్పలేమన్నారు.