రాజకీయాల్లో సహజం, అసహజం అన్న పదాలకు చోటు లేదన్నారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన పొత్తు అసహజమంటూ శివసేన రెబల్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో శివసేనకు బీజేపీకి అస్సలు పడటం లేదు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ మద్ధతుదారులు బీజేపీపై మండిపడుతున్నారు. తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అసహజమంటూ ఏవీ ఉండవన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన పొత్తు అసహజమంటూ శివసేన రెబల్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో సంజయ్ ఒక వ్యాసం రాశారు. బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సహజమైన పొత్తు అంటారా అంటూ ఆయన చురకలు వేశారు. గతంలో అజిత్ పవార్ కూడా ఎన్సీపీ నుంచి వెళ్లి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని.. కానీ అది పడిపోయిందని సంజయ్ రౌత్ గుర్తుచేశారు. దీనిని బట్టి రాజకీయాల్లో సహజం అసహజం లాంటివి వుండవని ఆయన అన్నారు. 

మరోవైపు.. మహారాష్ట్రలో (maharashtra) ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని (uddhav thackeray) విజయవంతంగా కూల్చిన ఏక్‌నాథ్ షిండే (eknath shinde) పాలనపై పట్టు బిగించడంతో పాటు ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. అలాగే అసలైన శివసేన (shivsena) తమదే అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యేలు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటూ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే విసిరిన సవాల్‌కు సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ఉప ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు ఓడిపోయినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ప్రజలే నిర్ణయిస్తారని ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. 

ALso Read:ఎన్నికలకు రెడీ.. రెబెల్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు ఓడినా, రాజకీయాలకు గుడ్‌బై: ఉద్ధవ్‌కు ఏక్‌నాథ్ షిండే సవాల్

పార్టీని, కార్యకర్తలను కాపాడేందుకే తాను శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశానన్నారు. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో శివ‌సేన అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఏమీ సాధించలేదన్నారు. నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచామ‌నీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తిరుగుబాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఆమోదించారని షిండే పేర్కొన్నారు.