Asianet News TeluguAsianet News Telugu

ఈడీ నోటీసులు డెత్ వారెంట్లు కాదు.. లవ్ లెటర్లు: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పొలిటికల్ వర్కర్లకు పంపే లవ్ లెటర్లు డెత్ వారెంట్లు కాదని, అవి లవ్ లెటర్లని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలాంటి లవ్ లెటర్ల తాకిడి ఇప్పుడు పెరుగుతున్నదన్నారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాదీ సర్కారును కూల్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఇప్పుడు లవ్ లెటర్ల ఆట మొదలైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆలయాలు తెరువలేదని, కేంద్ర ప్రభుత్వం హిందూత్వవాదినే అని భావిస్తున్నట్టు కామెంట్ చేశారు.

shivsena MP sanjay raut slams centre by calling ED notices as love letters, says frequency of love letters increased
Author
Mumbai, First Published Aug 30, 2021, 3:48 PM IST

ముంబయి: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ నోటీసులను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈడీ నోటీసులు పొలిటికల్ వర్కర్లకు డెత్ వారెంట్లు కాదని, లవ్ లెటర్లని తెలిపారు. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరవ్వాలని మరో మంత్రి అనిల్ పరాబ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. వీటిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈడీ నోటీసులు లవ్ లెటర్ల వంటివని రౌత్ అన్నారు. మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయాసపడుతూ అనేక ప్రయత్నాలు చేస్తూ విఫలమైన తర్వాత ఇప్పుడు ఈ లవ్ లెటర్ల తాకిడి పెరిగిందని పేర్కొన్నారు. బీజేపీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన గత ఎన్నికల తర్వాత సీఎం పీఠంపై లెక్కలు కుదరకపోవడంతో బంధాన్ని తెంచేసుకుంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫుల్ టైం సీఎం చాన్స్‌ను కొట్టేసింది.

మహారాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్‌పై బీజేపీ నేతల దాడులు పెరిగాయని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇదే క్రమంలో కేంద్ర ఏజెన్సీ ఈడీ నుంచి లవ్ లెటర్లూ పెరుగుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తనకు ఓ అనుమానం వస్తున్నదని అన్నారు. అయితే బీజేపీ మనిషి ఈడీలో డెస్క్ ఆఫీసర్ అయి ఉండాలి లేదంటే ఈడీ అధికారే బీజేపీ ఆఫీసులో పనిచేస్తూనైనా ఉండాలని ఆరోపించారు.

మహారాష్ట్రలో ఆలయాలు రీఓపెన్ చేయాలని బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నది. వీటిని సంజయ్ రౌత్ తిప్పికొట్టారు. రానున్న పండుగ సీజన్‌లో ఆంక్షలు విధించి ప్రజలు గుమిగూడకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హిందూత్వవాదినే అని అనుకుంటున్నట్టు పరోక్షంగా కామెంట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios