ఎన్సీపీ చీఫ్‌గా శరద్ పవార్ రాజీనామాపై సంజయ్ రౌత్ స్పందించారు. శరద్ పవార్ రాజీనామాను ఆయన బాలాసాహెబ్ రాజీనామాతో పోల్చారు. బురద రాజకీయాలు, ఆరోపణలతో విసిగిపోయి బాలాసాహెబ్ కూడా రాజీనామా చేశారని వివరించారు.
పూణె: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ రాజీనామాపై స్పందించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఈ రోజు ఆయన వెల్లడించారు. సడన్‌గా ఈ నిర్ణయం ప్రకటించడంతో ఎన్సీపీ సహా ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలూ షాక్ అయ్యారు. తాజాగా, ఈ నిర్ణయంపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
శరద్ పవార్ రాజీనామాను బాల్ ఠాక్రే రాజీనామాతో సంజయ్ రౌత్ పోల్చారు. బురద రాజకీయాలు, ఆరోపణలతో విసిగిపోయి శివసేన సుప్రీమ్ లీడర్ బాలాసాహెబ్ ఠాక్రే కూడా శివసేన ప్రముఖ్ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. చరిత్ర పునరావృతమైనట్టుగా అర్థమవుతున్నదని అభిప్రాయపడ్డారు. కానీ, శివసైనికుల ప్రేమ, ఆదరాభిమానాలతో ఆ నిర్ణయాన్ని బాల్ ఠాక్రే వెనక్కి తీసుకున్నారని ట్వీట్ చేశారు.
బాలాసాహెబ్ తరహాలోనే పవార్ సాహెబ్ కూడా రాష్ట్ర రాజకీయాలకు ఆత్మ వంటి వారని సంజయ్ రౌత్ వివరించారు.
ఎస్‌సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని.. ఇక నుంచి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పని చేస్తూనే ఉంటానని శరద్ పవార్ ప్రకటించారు. తన ఆత్మకథ Lok Maze Sangati రెండో ఎడిషన్ ఆవిష్కరణ సందర్భంగా పవార్ ఈ కామెంట్స్ చేశారు.
‘‘రాజ్యసభలో నాకు మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయను. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తాను. ఎలాంటి అదనపు బాధ్యతలూ తీసుకోను. నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. మే 1, 1960. నిన్న మే డే జరుపుకున్నాం. ఈ సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత ఎక్కడో ఒక్కచోట ఆగిపోవడం గురించి ఆలోచించాలి. అత్యాశతో ఉండకూడదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడూ ఒక పదవికి అతుక్కుపోయే స్థితిని తీసుకోను. మీకు ఇది కష్టంగా అనిపించొచ్చు. కానీ నేను ఎన్‌సీపీ చీఫ్ పదవి నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని శరద్ పవార్ చెప్పారు. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ చేపట్టనున్నారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
