మహారాష్ట్ర: శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహావికాస్ అఘాది కూటమి తరపున ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉద్ధవ్ ఠాక్రే. 

అందులో భాగంగా బుధవారం మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీలు గర్నర్ భగత్ సింగ్ కోశ్వారీని కలిశారు. ఒకవైపు అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు ఉద్ధవ్‌ రాజ్‌భవన్‌ వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. 

ఇకపోతే గురువారం సాయంత్రం 6.40 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఇకపోతే మంగళవారం సాయంత్రం సైతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీఅ య్యారు.  

ఉద్ధవ్‌ ఠాక్రేను తమ కూటమి నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీకి తెలియజేశారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు మూడు పార్టీల నేతలు. 

తమ కూటమికి 166మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు మహావికాస్ అఘాది కూటమి స్పష్టం చేసింది. దాంతో గవర్నర్ ఉద్ధవ్‌కు లేఖ రాశారు. డిసెంబర్‌ 3లోగా అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు లేఖ ఇవ్వాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే.