మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి వక్త. తన పదునైన విమర్శనాస్త్రాలతో ప్రత్యర్ధులను చీల్చి చెండాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా అంతే ఛమత్కారంగా మాట్లాడి జనాల్లో జోష్ తెచ్చారు చౌహాన్. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం బుధ్ని పర్యటనకు వెళ్లారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశిస్తూ ‘‘ ఎవరు భయపడకండి.. మీకు ఏం కాదు... నేను ఇక్కడే ఉన్నాను .. పులి ఇంకా బతికే ఉందంటూ’’ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై సినిమాలోని డైలాగులు చెప్పడంతో జనం ఆశ్చర్యపోయారు.

ఎన్నికల్లో ఓడిపోవడంతో తన నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పటం మాని ఆయన తనను తాను పులిగా చిత్రీకరించుకున్నారు. అయితే శివరాజ్ ఈ తరహా వ్యాఖ్యలు గతంలోనూ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ పాత హిందీ సినిమా పాట పాడుతూ రాహుల్ గాంధీని విదేశీయుడంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన సీఎ పదవికి రాజీనామా చేశారు.