అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన నేడు అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ ఘటన తలుచుకొని  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు.  బుధవారం భోపాల్ లో శివరాజ్ సింగ్ క్యాబినేట్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అయోధ్యలోని రామ‌మందిరం, భూమి పూజ గురించి చ‌ర్చ‌ జ‌రిగింది. 

ఈ సంద‌ర్భంగా రామాల‌య‌ ఉద్యమంనాటి జ్ఞాపకాలను వారంతా నెమ‌రువేసుకున్నారు. ఈ స‌మ‌యంలో సీఎం శివరాజ్‌సింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. 1990లో పార్టీ నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాల‌ను అంద‌రితో పంచుకున్నారు. కేబినెట్ సమావేశంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

 రామాల‌య‌ నిర్మాణ పనులు అయోధ్యలో ప్రారంభం కానున్నాయ‌ని, ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో పాటు దేశంలోని ప్ర‌జ‌లంతా ఈ భూమి పూజా కార్యక్రమానికి సాక్ష్యంగా నిల‌వ‌నున్నార‌న్నారు. లక్షలాది మంది రామ భక్తుల 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు, త్యాగ ఫలితంగా ఈ సంకల్పం నెరవేరింద‌న్నారు. 

1990లో ఎల్ కె అద్వానీ నాయకత్వంలో రథయాత్ర జరిగినప్పుడు తాను ఎమ్మెల్యేన‌ని, కర‌సేవ కోసం అయోధ్యకు త‌ర‌లివెళ్లామన్నారు. ‌ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో త‌మ‌ను అరెస్టు చేసి, జౌన్‌పూర్ జైలులో ఉంచార‌న్నారు. రాజనాథ్ సింగ్ కూడా అదే జైలులో ఉన్నారన్నారు. రామ‌భ‌క్తుల కార‌ణంగా జైలు వాతావరణం భక్తితో నిండిపోయింద‌న్నారు.