సీఎం ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన శివసేన జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యంగా కొత్త పార్టీకి బాలా సాహెబ్ థాక్రే పేరును వాడకుండా తీర్మానించారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీ కోసం శివసేన, బాలాసాహెబ్ థాక్రే పేరు ఉపయోగించొద్దని తీర్మానం చేశారు. మరోవైపు 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు డిప్యూటీ స్పీకర్. ఈ నెల 27 లోపు వివరణ ఇవ్వాలని ఆయన నోటీసులో పేర్కొన్నారు.
ఇకపోతే.. మహారాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది. శివసేన రెబల్ ఎమ్మెల్యే, మంత్రి ఏక్నాథ్ షిండే వ్యతిరేకత ఆగడం లేదు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఏక్‌నాథ్ షిండే మరియు ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే ప్రారంభించిన వైద్య ఆరోగ్య శిబిరానికి శివసైనికుల సెగ తగిలింది. పూణేలో శివసేన కార్యకర్తలు వారిద్దరి ఫోటోలకు నల్లరంగు వేశారు.
ఉస్మానాబాద్‌లో కూడా ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. శివసేన, ఔరంగాబాద్‌కు చెందిన మహావికాస్ అఘాడీ మంత్రి తర్వాత ఎమ్మెల్యే సందీపన్ బుమ్రే కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శివసేన కార్యకర్తలు రెబల్ ఎమ్మెల్యేల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేసే అకాశముందనే హెచ్చరికలు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
మహారాష్ట్రలో కొనసాగుతున్న సంక్షోభం మధ్య దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అలాగే, థానేలో కూడా 144 సెక్షన్ విధించబడింది. ఏక్‌నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. థానేలోని శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నివాసం వెలుపల భద్రతను పెంచారు.
మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తనపై షిండే క్యాంప్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని గుర్తుతెలియని ఇమెయిల్ చిరునామా ద్వారా పంపినందున దానిని తిరస్కరించారు. అలాగే, ఏ ఎమ్మెల్యే దానిని కార్యాలయంలో సమర్పించలేదు. ఆ లేఖపై అసలు సంతకాలు కూడా లేకపోవడంతో తిరస్కరణకు గురైందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ఇదిలావుండగా, "మా ప్రభుత్వం మైనారిటీలో లేదు. ఢిల్లీకి చెందిన మా పార్టీ లీగల్ టీమ్ కూడా మాకు సహాయం చేస్తోంది. మా ప్రభుత్వం కొనసాగుతోంది" అని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్ అన్నారు. MVA ప్రభుత్వం పని చేస్తోంది... ముందు కూడా కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
