ముంబై: కేంద్రంలో  బీజేపీ వ్యతిరేక ప్రభుత్వ ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలను శివసేన అపహాస్యం చేసింది. ఈ రకమైన ప్రయత్నం వినోదభరితమైందిగా ఆ పార్టీ అభిప్రాయపడింది.

శివసేన అధికారిక పత్రిక సామ్నాలో  సోమవారం నాడు ఈ మేరకు ఓ వ్యాసం ప్రచురితమైంది. చంద్రబాబునాయుడు ప్రయత్నాలపై ఆ వ్యాసంలో అపహస్యం చేశారు.కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని శివసేన అభిప్రాయపడింది. 

ప్రధానమంత్రి మోడీ కేదారినాథ్, బద్రీనాథ్ ఆలయాలను పర్యటించడంపై విపక్షాలు భయాందోళనలకు గురయ్యాయని సామ్నా వ్యాసంలో విమర్శలు గుప్పించారు.
సామ్నాలో ప్రచురితమైన వ్యాసంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్,  ఆప్  చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత బెనర్జీలపై విమర్శలు గుప్పించారు.  

మరో వైపు చంద్రబాబునాయుడు ఈ ఎన్నికల్లో ఓటమిపాలుకానున్నారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలోనే విపక్షాలను చంద్రబాబునాయుడు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

విపక్ష పార్టీల మధ్య ఉన్న ఐక్యత ఈ నెల 23వ తేదీన తేలనుందని సామ్నాలో రాశారు. విపక్షాలు మరోసారి మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కావని సామ్నా వ్యాసంలో తేల్చి చెప్పారు. బీజేపీ, శివసేన కూటమి 300కు పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకొనే ఛాన్స్ ఉందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు.