పెళ్లి కొడుకు ధరించిన షేర్వాని తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇది తమ సంప్రదాయం కాదని, ధోతి-కుర్తా ధరించాలని పెళ్లి కూతురు తరఫు బంధువులు గొడవ చేశారు. ఇది పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది.
మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఓ గిరిజన వరుడు తన పెళ్లిలో ‘షేర్వానీ’ ధరించాడు. అయితే ఇది వధువు కుటంబానికి నచ్చలేదు. దీంతో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 7వ తేదీన మంగ్బేడా గ్రామంలో గిరిజన కుటుంబంలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే వధువు బంధువుల వివాహ ఆచారాల ప్రకారం వరుడు ‘ధోతి-కుర్తా’ ధరించాల్సి ఉంటుంది. అయితే ధార్ నగరానికి చెందిన వరుడు సుందర్లాల్ ‘షేర్వానీ’ ధరించాడు. ఈ విషయం పెళ్లి కూతురు కుటుంబానికి, బంధువులకు నచ్చలేదు. దీనిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
పెళ్లి కొడుకు షేర్వానీని తీసేసి.. ధోతి-కుర్తా ధరించాలని వధువు తరపు బంధువులు పట్టుబట్టారు. అలా చేయడం కుదరదని పెళ్లి కొడుకు బంధువులు చెప్పారో ఏమో తెలియదు గానీ కొంత సమయంలోనే అక్కడ పరిస్థితులు మారిపోయాయి. అంతసేపు ప్రశాంతంగా, పెళ్లి సందడితో ఉన్న ఆ ప్రాంగణం అంతా ఉద్రిక్తంగా మారిపోయింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. అది హింసాత్మక ఘటనకు దారి తీసింది.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుపక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వారిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 294 (అశ్లీల చట్టం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కొంతమంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ధమ్నోడ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సుశీల్ యదువంశీ తెలిపారు. అయితే వధువు కుటుంబంతో ఎలాంటి వివాదం లేదని, ఆమె బంధువులు కొందరు ఈ దాడిలో పాల్గొన్నారని వరుడు సుందర్ లాల్ తరువాత మీడియాతో తెలిపారు. వేషధారణపై వివాదం మొదలైంది. దాడి, రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని చెప్పారు.
ఈ సంఘటన తరువాత మహిళలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు ధమ్నోడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసన తెలిపారు. వధువు బంధువులు తమపై రాళ్లు రువ్వారని, దీనివల్ల కొంతమందికి గాయాలయ్యాయని పోలీసు స్టేషన్ లోని కొందరు మహిళలు ఆరోపించారు. అయితే తరువాత వధూవరుల కుటుంబాలు ధార్ నగరానికి చేరుకుని వివాహ క్రతువులను పూర్తి చేసుకున్నాయని కుటుంబ వర్గాలు తెలిపాయి.
