ఖైదీలు ధరించే యూనిఫాం పచ్చరంగు చీరను తాను ధరించనని షీనాబోరా హత్య కేసు ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐకి ఓ అర్జీ పెట్టుకున్నారు. ఖైదీ యూనిఫాం నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆమె సీబీఐకి అర్జీ పెట్టుకున్నారు. 

షీనాబోరా హత్యకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోందని తాను ఇంకా దోషిగా తేలలేదని, అయినా ఖైదీలు ధరించే యూనిఫాంను ధరించమని జైలు అధికారులు అడుగుతున్నారని ముఖర్జీ ఆ లేఖలో పేర్కొంది. మరోవైపు.. దీనిపై వెంటనే సమాధానం దాఖలు చేయాలని బైకుల్లా జైలును కోర్టు కోరింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీ ప్రధాన నిందితురాలన్న విషయం తెలిసిందే. 2012 ఏప్రిల్ 23 న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురైంది. మూడేళ్ల తరువాత 2015 లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. 

ఇంద్రాణి డ్రైవర్ అప్రూవర్‌గా మారి హత్య విషయం బయటపెట్టడంతో పోలీసులు ఇంద్రాణిని అరెస్ట్ చేశారు. షీనాబోరాను హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.