ఆమెకు కంటి చూపులేదు. ఊహతెలియని వయసులోనే ఆమె కంటి చూపు కోల్పోయింది. కానీ.. ఆమెలో ఆత్మ విశ్వాసం మాత్రం ఏ మాత్రం కోల్పోలేదు. అందుకే.. అందరికీ ఎంతో కష్టతరమైన సివిల్స్ ని ఆమె సాధించింది.

సివిల్స్ లో 286వ ర్యాంక్ సాధించి క‌లెక్ట‌ర్‌గా ఎంపికైంది. ఆమె పురాణా సుంతారీ(25). తమిళనాడు రాష్ట్రానికి  చెందిన ఈ యువతికి ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో మాజీ క్రికెట‌ర్ మహ్మద్ కైఫ్ సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్ ద్వారా పురాణా సుంతారీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె విజ‌యాన్ని మెచ్చుకుంటూ స్ఫూర్తిదాయ‌క క‌థ‌నాన్ని పంచుకున్నారు. ఆడియో స్టడీ మెటీరియల్‌తో ప‌రీక్ష‌లు రాయ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. ఈ విష‌యంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌గా మార్చడానికి సహాయం చేశారన్నారు. మీ కలలను వెంటాడడాన్ని ఎప్పుడూ ఆపవద్ద‌ని పేర్కొన్నాడు. 

 

మ‌ధురైకి చెందిన పురాణా సుంతారీ త‌న‌ ఐదేళ్ల వ‌య‌సులో కంటి చూపు మంద‌గించింది. ఒక‌టో త‌ర‌గ‌తికి రాగానే పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ చ‌దువును ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. త‌ల్లిదండ్రులు, స్నేహితుల స‌హ‌కారంతో కష్ట‌ప‌డి చ‌దివింది. ఐఏఎస్ కావాల‌ని ల‌క్ష్యం పెట్టుకుంది. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని ప్రిప‌రేష‌న్ కొన‌సాగించింది. మొద‌టి మూడుసార్లు సివిల్స్ లో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. నాలుగోసారి 286 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది.