కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేత శశిథరూర్ ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. అయితే, శశిథరూర్‌తోపాటు బరిలోకి దిగే ఇతర అభ్యర్థులపై ఇంకా మిస్టరీనే ఉన్నది. కానీ, ఏఐసీసీ ట్రెజరర్ పవన్ కుమార్ బన్సల్ నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేత శశిథరూర్ ఈ నెల 30వ తేదీన నామినేషన్ వేయనున్నారు. 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన నామినేషన్ వేస్తారనే సమాచారం తమ ఆఫీసుకు అందింది అని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ ఈ రోజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే, ఆయనకు ప్రత్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారు అనే విషయంపై స్పష్టత లేదు. ఇదిలా ఉండగా.. తమ ఆఫీసు నుంచి ఏఐసీసీ ట్రెజరర్ పవన్ కుమార్ బన్సల్ నామినేషన్ పత్రాలు తీసుకెళ్లారని మధుసూదన్ మిస్త్రీ వివరించారు. అయితే, అవి బహుశా ఆ పత్రాలు ఇతరుల కోసమై ఉంటాయని అభిప్రాయపడ్డారు. దీంతో శశిథరూర్‌తోపాటు కాంగ్రెస్ అధ్యక్ష బరిలోకి దిగే మరో అభ్యర్థి ఎవరనే అంశం ఇంకా మిస్టరీగానే ఉన్నది. ఇన్నాళ్లు అశోక్ గెహ్లాట్ బలమైన అభ్యర్థిగా ప్రచారం జరిగింది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పోటీ నుంచి ఆయన దాదాపు తప్పుకున్నట్టే అని చెబుతున్నారు.

శశిథరూర్ సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు అందిస్తారని ఆయన ప్రతినిధి ఒకరు తమ ఆఫీసుకు తెలిపారని మిస్త్రీ వివరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 10 జనపథ్‌లో సోనియా గాంధీని కలిసి ఆమెకు ఓటర్ ఐడీ కార్డు అందించానని, ఇప్పటి వరకు జరిగిన ఎన్నిక ప్రక్రియ గురించి వివరించానని చెప్పారు. తమ ఆఫీసు నుంచి బన్సల్ నామినేషన్ పత్రాలు కలెక్ట్ చేసుకున్నారని, కానీ, అవి బహుశా మరొకరి అభ్యర్థిత్వాన్ని బలపర్చేందుకు కోసమేమో అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ చీఫ్ పోస్టు ఎన్నికకు సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ దాఖలు చేసే గడువు ఉన్నది. వీటిని అక్టోబర్ 1న పరీక్షిస్తారు. అక్టోబర్ 8వ తేదీ లోపు ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇస్తారు. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. 

ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే.. అక్టోబర్ 17వ తేదీన పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 19న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.