రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, పార్టీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్‌పార్టీకి విపరీతమైన క్రేజ్ ను సృష్టించాయని శశిథరూర్ అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల గెలుపు ఓటములపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. తొలుత అధ్యక్షపోరు రసవత్తరంగా సాగినా.. పలు ప్రకటనలు చూస్తుంటే.. మల్లికార్జున ఖర్గేనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా గెలవొచ్చనే విశ్లేషణలు తెరమీదకు వస్తున్నాయి. ఈ కథనాలకు ప్రధాన కారణం లేకపోలేదు. ఆయనకు గాంధీ కుటుంబం సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించారు.
ఈ తాజా తరుణంలో అధ్యక్ష ఎన్నికల గెలుపు ఓటములపై శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన శనివారం అస్సాంలోని గువహాటిలో జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. యువకులు,పార్టీలోని కింది స్థాయి నాయకులు తనకు మద్దతిస్తున్నారని, సీనియర్లు తన ప్రత్యర్థి మల్లికార్జున్ ఖర్గేకు మద్దతిస్తున్నారని అన్నారు. గాంధీ కుటుంబానికి దూరంగా ఉండే ఏ వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేయలేరని, ఎందుకంటే గాంధీ కుటుంబ డీఎన్‌ఏతోనే పార్టీ నడుస్తుందని ఆయన అన్నారు.
చాలా మంది పార్టీ ఆఫీస్ బేరర్లు తన ప్రత్యర్థి అభ్యర్థి కోసం బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని అంగీకరిస్తూనే, రహస్య బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరుగుతాయని, సీనియర్ నాయకుడు,తక్కువ స్థాయి సభ్యుడి ఓటు వెయిటేజీ ఒకే విధంగా ఉంటుందని ఆయన ఎత్తి చూపారు. కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడుతో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేస్తానని,ఓట్ల చీలికను తగ్గించేందుకు ఉమ్మడి ప్రతిపక్షం ఏర్పాటు చేయడమే తన ప్రాధాన్యత అని అన్నారు. తాను ఎన్నికైతే అధికార వికేంద్రీకరణ, నాయకత్వంలో యువరక్తాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మార్పు తీసుకురావడమే తన పదవీకాలంలో ప్రధానాంశమని చెప్పారు.
చాలా మంది సహాచర నేతలు వివిధ కారణాలతో పార్టీని వీడారని,తన హయాంలో ఎవరూ నిర్లక్ష్యం చేయడం వల్ల పార్టీని వీడలేదని ఆయన అన్నారు.తాను ప్రచారంలో భాగంగా తాను 11 రాష్ట్రాల్లో పర్యటించానని తెలిపారు.వనరుల కొరత కారణంగా ఈశాన్య ప్రాంతంలో అస్సాం ఒంటరిగా ఉందని థరూర్ చెప్పారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, పార్టీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్‌కు విపరీతమైన పట్టును సృష్టించాయని ఆయన అన్నారు. దేశంలోని ప్రజలందరినీ కుల, మత, లింగ, ప్రాంతీయ, భాషా బేధాలు లేకుండా ఏకత్వంతో చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీనేననీ, భారతీయులందరినీ కాంగ్రెస్ పార్టీ తన కార్యకర్తలుగా భావిస్తుందని అన్నారు.
అధ్యక్ష ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పార్టీకి లభించినంతగా ప్రజాధరణ.. గత ఎనిమిదేళ్లలో కాంగ్రెస్ మీడియా దృష్టిని ఆకర్షించలేదని థరూర్ తెలిపారు.అక్టోబరు 17న జరగనున్న పార్టీ అత్యున్నత పదవికి జరిగే ఎన్నికలలో ప్రముఖ కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గేతో తిరువనంతపురం ఎంపీ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న ప్రకటించబడతాయి.
