Asianet News TeluguAsianet News Telugu

సునంద పుష్కర్ కేసు: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు బెయిల్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు గురువారం నాడు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశిథరూర్ కు కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. మృతికి కొన్ని రోజుల ముందు శశిథరూర్ పై పుష్కర్ ఆరోపణలు చేశారు.

Shashi Tharoor Gets Protection From Arrest, Needs Permission to Fly Out

న్యూఢిల్లీ :సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టు గురువారంనాడు  ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తన భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో థరూర్‌ ముందస్తు బెయిల్‌ కోరిన సంగతి తెలిసిందే. 

కాంగ్రెస్ పార్టీ తరపున తిరువనంతపురం నుండి ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సునంద పుష్కర్ కేసులో  థరూర్‌ను ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే కోర్టు జులై 7న కోర్టు ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది.  ఢిల్లీ కోర్టు ఆయనకు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ రూ.లక్ష పూచీకత్తుపై ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది.

2014 జనవరి 17న సునంద పుష్కర్‌ దిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో  అనుమానాస్పద స్థితిలో మరణించారు. అంతకుముందు రెండ్రోజుల క్రితమే పుష్కర్‌ తన భర్త థరూర్‌కు  పాకిస్థాన్ జర్నలిస్ట్‌తో సంబంధం ఉందని నిందిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

 పుష్కర్‌ మరణించడానికి ముందు రోజుల్లో థరూర్‌ ఆమె ఫోన్‌కాల్స్‌ను నిర్లక్ష్యం చేశాడని  ఆమె కాల్స్‌ కట్‌ చేశారని అందువల్లే ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఆమె మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు వెల్లడించారు. థరూర్‌పై సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని  హింసించారని ఆరోపణలు ఉన్నాయి.

 సునందపుష్కర్ మరణించడానికి ముందు ఆమె చేసిన ఈమెయిల్స్‌, మెసేజెస్‌, సోషల్‌ మీడియా పోస్ట్‌లు అన్నింటిని పరిగణలోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios