చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు శరవేగంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తుకు పై ఎత్తులతో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. డీఎంకే పార్టీతో స్నేహ రాగానికి సమత్తువ మక్కల్ కట్చి సై అంటోంది.  

ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆహ్వానిస్తే ఆ పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సమత్తువ మక్కల్‌ కట్చి నాయకుడు శరత్‌కుమార్‌ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా ఆలంకుళంలో ఓ కళాశాలలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న శరత్ కుమార్  వచ్చే యేడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమిని ఏర్పాటు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో బీజేపీ, అధికార అన్నాడీఎంకేతో తమ పార్టీ పొత్తుపెట్టుకునే అవకాశాలు ఏమాత్రం లేవని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో డీఎంకే ఆహ్వానిస్తే ఆ పార్టీతో పొత్తును ఏర్పాటు చేసుకునేందుకు తగు చర్యలు చేపడతానని తెలిపారు. నిర్మాతల మండలి వివాదం ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం కావాలని ఆశిస్తున్నట్లు శరత్‌కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.