ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న పద్ధతిపై శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను చీల్చి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటకలో ప్రభుత్వాలను కూల్చారని విమర్శలు గుప్పించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనదైన శైలిలో స్పందించారు. కీలకమైన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నిర్ణయాత్మక విజయం సాధించిందనీ, 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్దం కావాలని శరద్ పవార్ పిలుపు నిచ్చారు. కర్ణాటకలో ఎన్‌సిపి కూడా పోటీ చేసింది. అయితే, ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే అని మహారాష్ట్రలో సంక్షోభానికి కేంద్రంగా ఉన్న శరద్ పవార్ అన్నారు. 'మోదీ హైతో ముమ్కిన్ హై'(మోదీ ఉంటేనే అన్ని సాధ్యం) అన్న నినాదాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రశంసిస్తూ "ఒక వ్యక్తి విజయానికి అనేక మార్గాలున్నా.. నేడు ప్రజలే అతడిని తిరస్కరిస్తున్నారనీ, ఆ విషయం నేడు స్పష్టంగా అర్థమైందని పవార్ అన్నారు.
కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలుపుతూ .. దక్షిణాదిలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే కాంగ్రెస్ దాదాపు రెట్టింపు సీట్లను గెలుచుకోవడం అవినీతికి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని అన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి చాలా రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో లేదు. కర్ణాటక ఫలితాల అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితేంటని ఊహించుకోవచ్చనీ, కర్ణాటక ఫలితాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం కనిపిస్తోందని అన్నారు.
'ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కొత్త పద్ధతి'
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, కర్నాటక ల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చిందనీ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టేందుకు బీజేపీ అనుసరిస్తున్న సరికొత్త పద్ధతిపై శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు.‘‘ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలను చీల్చి, అధికారంలో లేని రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందుకు అధికారాన్ని వినియోగించుకోవాలనే ఫార్ములాను ప్రయోగించిందనీ, కర్ణాటకలో కూడా అదే పని చేసి.. అక్కడి ప్రభుత్వాన్ని కూడా కూల్చివేసింది. మహారాష్ట్రలోనూ అదే జరిగిందనీ, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేశారరు. మధ్యప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలపై విరుచుకుపడి కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది. గోవాలో కూడా బీజేపీ అదే చేసింది. ప్రభుత్వం యంత్రాంగాన్ని, వనరులను వినియోగించుకోవడం ప్రారంభించిందని.. అయితే, ఈ రాజకీయాలు ప్రజలకు నచ్చడం లేదని కర్ణాటక ఫలితం తేల్చి చెప్పింది." అని విరుచుకపడ్డారు.
మహా వికాస్ అఘాడి భవిష్యత్తుపై
NCP నాయకుడు అజిత్ పవార్ అనిశ్చితి కారణంగా మహారాష్ట్రలో సంక్షోభం సూచనను కొట్టిపారేసిన శరద్ పవార్.. NCP ఒంటరిగా పోరాడే ప్రశ్నే లేదని అన్నారు. "ఇప్పుడు మూడు పార్టీలు (ఎన్‌సిపి, ఉద్ధవ్ సేన , కాంగ్రెస్) కలిసి రావాలని మేము భావిస్తున్నాము , చిన్న పార్టీలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని మేము భావిస్తున్నాము. అయితే నేను ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకోను, కానీ మిగిలిన సహచర పార్టీలతో చర్చిస్తాను." అని శరద్ పవార్ అన్నారు.
