తాను ప్రధాని రేసులో లేనని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలనుకుంటున్నానన్నారు.

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మరోసారి సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రేసులో లేనని ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడంతోపాటు వచ్చే ఏడాది ప్రధాని నరేంద్ర మోడీకి చెందిన బిజెపిని ఎదుర్కోవడానికి కూటమిని ఏర్పాటు చేయడంలో తాను కీలక పాత్రను పోషిస్తానని చెప్పారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసమే నా ప్రయత్నాలు.. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా అదే ప్రయత్నాలు చేస్తున్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను. కాబట్టి నేను ప్రధాని రేసులో లేను. దేశాభివృద్ధికి పాటుపడే ఇలాంటి నాయకత్వం ప్రతిపక్షాలకు రావాలని కోరుకుంటున్నానని పిలుపునిచ్చారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్‌సిపి చీఫ్ అన్నారు. పూణే యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ రామ్ తకవాలే మృతిపై ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి రాహుల్ గాంధీ కారణమని శరద్ పవార్ ప్రశంసించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైందనడానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అన్నారు. ప్రజలు ఆయన గురించి ఏం మాట్లాడినా రాహుల్ గాంధీ సిద్ధాంతాన్ని ప్రజలు బలపరుస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు.

ఏజెన్సీల దుర్వినియోగం

ఎన్‌సిపి చీఫ్ జయంత్ పాటిల్‌ను ఈడీ ప్రశ్నించడంపై స్పందించారు. ప్రభుత్వం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని శరద్ పవార్ అన్నారు. కేంద్ర సంస్థల ద్వారా ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతోందనీ, ఎన్‌సిపి నాయకులను వేధించడం ద్వారా బిజెపి ఏదో లాభపడాలనుకుంటోందనీ, కానీ మేము వారిని సంతృప్తి పరచడం లేదని తెలిపారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)లో భాగమైన కాంగ్రెస్, శివసేనతో సీట్ల పంపకంపై ఇటీవల తన నివాసంలో సమావేశం జరిగిందని అన్నారు. దీనిపై ఎంవీఏ నేతలు నిర్ణయం తీసుకుంటారు. ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమావేశమై దాని గురించి చర్చిస్తారని తెలిపారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో 15 రోజుల్లో రెండు పెద్ద పేలుళ్లు జరగనున్నాయని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే (ఏప్రిల్ 17న) సంచలన ప్రకటన చేశారు. సరిగ్గా ప్రకటన వెలువడిన 16వ రోజున అంటే మే 2న శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కారణం ఆయన చెప్పలేదు.