సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడాలని, ఒకే తాటిపైకి రావాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. 

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకే తాటిపైకి రావాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. శనివారం న్యూ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో NCP వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా NCP చీఫ్ శరద్ పవార్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విలేఖరులతో శరద్ పవార్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మెజారిటీ రాష్ట్రాల్లో తిరస్కరణకు గురైందని, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాషాయ పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిందని విమర్శించారు.

రాష్ట్ర స్థాయిలో ప్రజలు బిజెపిని తిరస్కరించినట్లయితే.. జాతీయ స్థాయిలో వారి (పౌరులు) అభిప్రాయం భిన్నంగా ఉండదని NCP చీఫ్ నొక్కిచెప్పారు. జూన్ 23న బీహార్‌లోని పాట్నాలో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని పవార్ తెలియజేశారు. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి కూర్చుని ఉమ్మడి ప్రాతిపదికన ప్రతిపక్ష ఐక్యత గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. బిజెపి ప్రజలకు పెద్ద హామీలు ఇచ్చిందనీ, ప్రజల అంచనాలను పెంచిందనీ, కానీ.. ప్రజలకు ఏమీ చేయలేదనీ, ఇది ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేయాల్సిన సమయమని అన్నారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)పై మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ ని బీజేపీ యొక్క 'బి' టీమ్" ( పార్టీ) అని విమర్శించారు. ప్రకాష్ అంబేద్కర్ యొక్క వంచిత్ బహుజన్ అఘాడి (విబిఎ) కారణంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సిపి కూటమి తిరోగమనాన్ని ఎదుర్కొందని, ఈ సారి ఆ పార్టీ అలాంటి ఎదురుదెబ్బ తగలవచ్చని తెలిపారు. అన్ని పార్టీలకు ఏ రాష్ట్రంలోనైనా తమ పునాదిని విస్తరించుకునే హక్కు ఉందనీ, బీఆర్‌ఎస్..బీజేపీ తోక పార్టీ అని అన్నారు.

నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మట్లాడుతూ .. మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)తో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. పౌర, అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి స్థానంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

యూనిఫాం సివిల్ కోడ్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కులం, మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ జనాభా నియంత్రణ చట్టం అవసరమని పవార్ అన్నారు, అయితే UCC ఒక నిర్దిష్ట కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుంటుందా? అనేది తెలుసుకోవాలని అన్నారు.

కర్ణాటకలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం హిందుత్వ సిద్ధాంతకర్త దివంగత వీడీ సావర్కర్, ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ హెడ్గేవార్‌లకు సంబంధించిన అధ్యాయాలను పాఠశాల పుస్తకాల్లో తొలగించడంపై ప్రశ్నించగా పవార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అలాంటి చర్యకు హామీ ఇచ్చిందని చెప్పారు. సామాజిక ఐక్యతను ప్రభావితం చేసే అధ్యాయాలను తొలగిస్తామని అక్కడి కాంగ్రెస్ వాగ్దానం చేసిందని ఆయన అన్నారు. కర్నాటక ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి వచ్చారంటే, వారు కాంగ్రెస్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారని పవార్ అన్నారు.

డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ కంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి ఎక్కువ పాపులర్ అని సర్వేలో తేలిందని పేర్కొంటూ మంగళవారం అనేక దినపత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. ఈ అంశంపై కూడా స్పందిస్తూ.. బిజెపికి పెద్ద పాత్ర ఉందనే అపార్థాన్ని తొలగించారని, ఇలాంటి ట్రిక్కులను ఉపయోగిస్తున్నారని అన్నారు. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కంటే సీఎం షిండే కు రాష్ట్రంలో ఎక్కువ ప్రజాదరణ పొందారని వార్తాపత్రిక ప్రకటనపై మాటల యుద్ధం చెలరేగింది. ఫడ్నవీస్‌ కంటే జనాదరణలో షిండే ముందంజలో ఉన్నారని 'సర్వే'ను ఉటంకిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన పూర్తి పేజీ ప్రకటన మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన వార్తాపత్రికల్లో కనిపించాయి. ఫడ్నవీస్ లేదా శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే చిత్రాలు లేని ఈ ప్రకటన.. జూన్ 30న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకోనున్న రెండు మిత్రపక్షాల మధ్య విభేదాల గురించి చర్చలకు ఆజ్యం పోసింది.