కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని పవార్ అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు ఘాటైన ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తాజాగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు.మే 10న పోలింగ్ జరగనున్న కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనని ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు.

ఓ ప్రాంతీయ వార్తా ఛానెల్‌తో మాట్లాడిన పవార్.. 'కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ మతపరమైన నినాదాలు చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. సెక్యులరిజం భావనను అంగీకరించాం. మీరు ఎన్నికల్లో ఏదైనా మతం లేదా మతపరమైన అంశాన్ని లేవనెత్తినప్పుడు.. అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ పరిణామం మంచిది కాదు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదంపై ప్రమాణం చేస్తాం' అని ప్రధానికి గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పిన పవార్ .. కన్నడ నాట కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వస్తుందని అన్నారు. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

ఇదిలా ఉంటే.. పవార్ ఇటీవల ఎన్‌సిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే పార్టీ కార్యకర్తల నుండి పదేపదే అభ్యర్థనల తరువాత.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్లీ పదవిలో కొనసాగడానికి అంగీకరించారు. అలాగే.. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టుపై కొనసాగుతున్న ఆందోళన గురించి ఆయన మాట్లాడుతూ..తానే స్వయంగా ఆ ప్రాంతానికి సందర్శించడానికి ఆసక్తిగా ఉన్ననని, అయితే.. ఎప్పుడు అనేది సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. బార్సు గ్రామస్తుల ప్రతినిధులతో సమావేశమయ్యాను. నిపుణులతో మరోసారి సమావేశం చేస్తాను. గ్రామస్తుల ఆందోళనను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై తాము ముందుకు వెళ్తామని తెలిపారు.