మహారాష్ట్ర ప్రభుత్వం మహావికాస్ అఘాదీ రూపకర్తగా పేరున్న ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై శివసేన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్ గీతె సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ ఎప్పటికీ తమ లీడర్ కాబోరని, ప్రస్తుత కూటమి కేవలం అడ్జస్ట్‌మెంట్ మాత్రమేనని వివరించారు.

ముంబయి: కేంద్ర మాజీ మంత్రి, శివసేన సీనియర్ లీడర్ అనంత్ గీతె.. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచిన పవార్ తమకు ఎప్పుడూ గురువు కాబోడని స్పష్టం చేశారు. ఇలా వ్యాఖ్యానిస్తూ ప్రస్తుత మహారాష్ట్ర కూటమిపైనా మాట్లాడారు. మహావికాస్ అఘాదీ(ఎంవీఏ) కేవలం ఒక అడ్జస్ట్‌మెంట్ మాత్రమేనని, తర్వాత ఎవరి దారి వారిదని వివరించారు.

మహారాష్ట్రలో 2014 నుంచి 2019వరకు బీజేపీతో కలిసి ప్రభుత్వంలో భాగంగా ఉన్న శివసేన తర్వాత కాంగ్రెస్, ఎన్‌సీపీతో జట్టుకట్టింది. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ వ్యూహంతో ఈ మూడు పార్టీలు ఒక తాటిపైకి ప్రభుత్వం ఏర్పడిందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఈ మూడు పార్టీల నేతలు కొంతలో కొంతైనా పవార్‌ను గౌరవిస్తుంటారు. కానీ, ఇటీవలే శివసేన నేతలు వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయి. తాజాగా, ఆ పార్టీ సీనియర్ నేత అనంత్ గీతె ఇదే తరహాలో మాట్లాడారు.

‘శరద్ పవార్ ఎప్పటికీ మా నేత కాలేదు. మహావికాస్ అఘాదీ కేవలం ఒక అడ్జస్ట్‌మెంట్ మాత్రమే. మా గురువు మాత్రం బాలాసాహెబ్ ఠాక్రేనే. ఈ ప్రభుత్వం నడిచినంత కాలం నడుస్తుంది. తర్వాత మేం విడిపోతే మా ఇల్లు శివసేననే. మా పార్టీ వెంటే మేం ఉంటాం’ అని అన్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఆలోచనలేవీ లేవని, ఎంవీఏ విజయవంతమవ్వాలని ఆశించారు. 

‘కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచి శరద్ పవార్ ఎన్‌సీపీని స్థాపించారు. అలాంటి కాంగ్రెస్, ఎన్‌సీపీ ఒకటి కానప్పుడు, శివసేన కూడా అందులో కలవదు. కాంగ్రెస్ నిబంధనలన్నింటినీ శివసేన పాటించదు’ అని తెలిపారు.