మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం చిక్కుల్లో పడింది.

ఈ వ్యవహారాన్ని చల్లార్చి సంకీర్ణ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎన్సీపీ అధినేత పవార్ రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమిత్‌షా స్పందించారు. తమ మధ్య సమావేశం జరిగిందన్న ఆయన.. వివరాల్ని చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ప్రతిదీ బయటకు చెప్పాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదని షా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై విలేకరులు ఎన్నిసార్లు అడిగినా ఆయన మాత్రం అసలు విషయాన్ని బయట పెట్టకపోవడం గమనార్హం. 

Also Read:అవినీతి ఆరోపణలు.. అనిల్ దేశ్ ముఖ్ షాకింగ్ నిర్ణయం, సీఎం కి లేఖ

మరోవైపు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని మహారాష్ట్ర సీఎం నిర్ణయం తీసుకొన్నారని మహారాష్ట్ర హోంమంత్రి  అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని హోంమంత్రి సీఎం ఉద్దవ్ ఠాక్రేకు రెండు రోజుల క్రితం లేఖ రాశారు. దీంతో ఈ అంశంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారని ఆదివారం నాడు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.

ముంబైలోని పలు బార్లు, రెస్టారెంట్ల నుండి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని పోలీసులకు హోంమంత్రి  ఆదేశించారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఆరోపించిన విషయం తెలిసిందే.

ఈ విషయమై పరమ్‌బీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. సుప్రీం సూచన మేరకు మాజీ పోలీస్ కమిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.