ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఓ పెళ్లి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఓ పెళ్లి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కియోంజర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి 20 సమీపంలోని సతీఘర్ సాహి వద్ద మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సతీఘర్ సాహికి చెందిన కార్తీక్ పాత్ర కుమార్తెకు, హరిచందన్‌పూర్ బ్లాక్ పరిధిలోని మాన్‌పూర్ గ్రామానికి చెందిన హడిబంధు పాత్ర కుమారుడు హేమంత పాత్రతో వివాహం జరగాల్సి ఉంది.

ఈ క్రమంలోనే వరుడు, అతని కుటుంబ సభ్యులు డీజేతో ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరారు. అయితే వధువు ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో ఒక లారీ వేగంగా దూసుకొచ్చి పెళ్లి ఊరేగింపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం కటక్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేశారు. మిగిలిన ఆరుగురిని కియోంజర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక, ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు రాజముండా-పనికోయిలి జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.