బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ జిల్లాలోని కుమారేశ్వరనగర్‌లో విషాదం చోటు చేసుకొంది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. 

విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలను చేపట్టారు.గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడేళ్లుగా ఈ భవన నిర్మాణపనులు జరుగుతున్నాయి. మూడంతస్తుల భవనం నిర్మాణం పూర్తైంది.  మరో రెండంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తున్నారు.  భవనం కుప్పకూలిన ఘటనలో  ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు గుర్తించారు. మృతదేహాన్ని కూడ వెలికితీశారు.

ఆరు అగ్నిమాపక యంత్రాల సహాయంతో శిథిలాల కింద చిక్కుకొన్నవారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకొన్న వారికి అత్యవసరంగా చికిత్స అందించేందుకు వీలుగా 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని  సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించినట్టుగా కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రకటించారు.

శిథిలాల కింద చిక్కుకొన్న 40 మందిలో 15 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.నాణ్యత ప్రమాణాలు లేకుండా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీని కారణంగానే ఈ భవనం కుప్పకూలిందని  చెబుతున్నారు. ఈ భవనం ఓ రాజకీయ పార్టీకి చెందిందని చెబుతున్నారు.అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే  ఈ ఘటన చోటు చేసుకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.