కర్ణాటకలోని మైసూరులో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు.
కర్ణాటకలోని మైసూరులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు జిల్లా కురుబురు గ్రామం పింజర పోల్ సమీపంలో ప్రైవేట్ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. కొల్లేగల- టీ నరసీపూర్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా.. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇక, ఇన్నోవాలో చిక్కుకున్నవారిని స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.
ఇక, మృతులు బళ్లారికి చెందినవారిని.. వారు మైసూర్‌కు విహారయాత్రకు వచ్చారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 13 మంది ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇన్నోవాలో ఉన్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ముగ్గురిని చామరాజనగర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని బళ్లారికి చెందిన జనార్దన్ (45), పునీత్ (4), శశికుమార్ (24)గా గుర్తించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇక, బస్సులో ఉన్న 20 మందికి కూడా గాయాలు కాగా.. టి.నరసీపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తదుపరి చికిత్స నిమిత్తం ఇద్దరినీ మైసూర్ ఆస్పత్రికి తరలించారు. అయితే రోడ్డు మలుపు వద్ద సూచిక లేకపోవడమే ప్రమాదానికి కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
