జార్ఖండ్‌లో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పాకూర్ జిల్లాలో (Pakur district) గ్యాస్ సిలిండర్లలతో వెళ్తున్న ట్రక్కు, బస్సు ఢీ కొన్న ఘటనలో 15 మంది మృతిచెందారు. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు

జార్ఖండ్‌లో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పాకూర్ జిల్లాలో (Pakur district) గ్యాస్ సిలిండర్లలతో వెళ్తున్న ట్రక్కు, బస్సు ఢీ కొన్న ఘటనలో 15 మంది మృతిచెందారు. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తర్వాత మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి కనిపించాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ట్రక్కు వేగంగా వచ్చి బస్సును ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అమ్రపర పోలీస్ స్టేషన్ పరిధిలోని పదేర్‌కోలా గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత చాలా మంది ప్రయాణికులు బస్సులో చిక్కుకు పోయారు. దీంతో పోలీసులు, సహాయక సిబ్బంది గ్యాస్ కట్టర్స్‌తో బస్సు భాగాలను కత్తిరింది.. మృతదేహాలను, గాయపడినవారిని బయటకు తీశారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

అయితే అదృష్టవశాత్తూ ట్రక్కులో ఉన్న గ్యాస్ సిలిండర్‌లలో ఒక్కటి కూడా పేలలేదని.. అలా జరిగి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని పోలీసులు తెలిపారు.