ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్రా నది వంతెనపై నుంచి ట్రాక్టర్ ట్రాలీ కిందపడి 12 మంది మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్‌లోని తిల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం భారీ ప్రమాదం జరిగింది. గర్రా నది వంతెనపై నుంచి ట్రాక్టర్ ట్రాలీ కిందపడి 12 మంది మృతి చెందారు. ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాజహాన్‌పూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్పించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ దద్రౌల్ ప్రాంతంలోని సునౌరా గ్రామ నివాసితులని సమాచారం. గర్రా నది నుండి నీటిని సేకరించేందుకు ట్రాక్టర్-ట్రాలీలో వెళ్లారు. ఈ క్రమంలోనే వారు ప్రమాదానికి గురయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
షాజహాన్‌పూర్‌లోని జరిగిన ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
